ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో ఉద్దానం.. వ‌రుస కిడ్నీ మ‌ర‌ణాలు...!

RAMAKRISHNA S.S.
- ( ఉత్త‌రాంధ్ర - ఇండియా హెరాల్డ్ )

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న కోటఉరట్ల ప్రాంతం ఇప్పుడు మరో ‘ఉద్ధానం’లా మారుతోందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. గత దశాబ్దాలుగా శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం ప్రాంతం కిడ్నీ వ్యాధులకు నిలయంగా మారి ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అచ్చం అదే తరహాలో కోట ఉరట్ల శివారు ప్రాంతమైన గొల్లపేటలో కిడ్నీ వ్యాధి కోరలు చాస్తోంది. స్థానిక నివేదికల ప్రకారం, గొల్లపేటలో ఇప్పటి వరకు కిడ్నీ వ్యాధి బారిన పడి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మరో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉండటంతో వారు నిరంతరం డయాలిసిస్ చేయించుకుంటున్నారు. వీరు కాకుండా, మరో 20 నుంచి 25 మంది ప్రాథమికంగా కిడ్నీ వ్యాధి నిర్ధారణ అయి, తీవ్రమైన నొప్పులు మరియు అనారోగ్యంతో పోరాడుతూ మందులు వాడుతున్నారు. చిన్న గ్రామంలో ఇంత మంది కిడ్నీ బాధితులు ఉండటం స్థానికులను భయాందోళనలకు గురి చేస్తోంది.


కలుషిత నీరే ప్రధాన శత్రువు :
ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధులు ప్రబలడానికి ప్రధాన కారణం తాగునీరు కలుషితం కావడమేనని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వాలు రక్షిత మంచినీటి పథకాలు ఏర్పాటు చేసినట్లు చెబుతున్నా, పైపుల ద్వారా వచ్చే నీటిలో సుద్ధ ఎక్కువగా కలిసి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటిని తాగడం వల్ల అది శరీరంలోకి చేరి వ్యర్థాలుగా మారి కిడ్నీలలో పేరుకుపోతోందని, ఫలితంగా కిడ్నీలు దెబ్బతింటున్నాయని స్థానికులు నమ్ముతున్నారు. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం గానీ, ప్రజా ప్రతినిధులు గానీ తమ సమస్యను పట్టించుకోవడం లేదని గొల్లపేట ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి వచ్చి పరిస్థితిని సమీక్షించిన నాథుడే లేడని, మరణాలు సంభవిస్తున్నా అధికారులలో కదలిక లేదని వారు వాపోతున్నారు. తక్షణమే ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి, పరిశోధనలు జరిపించి, స్వచ్ఛమైన తాగునీటిని అందించకపోతే ఈ గ్రామం మొత్తం కిడ్నీ వ్యాధి కోరల్లో చిక్కుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.


ఉద్ధానం విషాదం పునరావృతమవుతుందా.. ?
ఉత్తరాంధ్రాలో ఉద్ధానం సమస్య ఇప్పటికీ పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదు. అక్కడ కిడ్నీ వ్యాధులకు గల ఖచ్చితమైన కారణాలపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కోట ఉరట్ల కూడా అదే బాటలో పయనిస్తుండటం చూస్తుంటే, పాలకుల ఉదాసీనత వల్ల మరో ప్రాంతం శ్మశానవాటికగా మారుతుందా అనే అనుమానం కలుగుతోంది. తక్షణమే ప్రభుత్వం స్పందించి కోట ఉరట్ల బాధితులను ఆదుకోవాలని, పటిష్టమైన వైద్య సదుపాయాలు కల్పించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: