భలే విచిత్రం.. తెలంగాణ కూల్.. ఆంధ్రా హాట్ హాట్..

Chakravarthi Kalyan

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో రాజకీయ సన్నివేశాలు వేడెక్కుతున్నాయి. అటు ఆంధ్రా, ఇటు తెలంగాణ ఒకేసారి రెండు రాష్ట్రాల బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడంతో అందరి దృష్టీ ఆ సమావేశాలపైనే ఉంది.

ఐతే.. రెండు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఆంధ్రా అసెంబ్లీ మాంచి వాడి వేడి మీద ఉంటే.. దానితో పోల్చుకుంటే.. తెలంగాణ అసెంబ్లీ కాస్త కూల్ కూల్ గానే సాగిపోతోంది. ఆంధ్రాలో టీడీపీ- వైసీపీల మధ్య రాజకీయ సమరం తీవ్రవాగ్యుద్దాలకు, స్పీకర్లపై ఆరోపణలకు, దారి తీస్తుంటే.. తెలంగాణ అప్పుడప్పడు గొడవలైనా ఓవరాల్ గా బాగానే సాగుతోంది.

జగన్- చంద్రబాబు ఈ సమావేశాల్లో ఇప్పటివరకూ డైరెక్టుగా వాగ్వాదాలకు దిగకపోయినా.. సూటిపోటి విమర్శలు చేసుకున్నారు. జగనైతే ఏకంగా కడిగేస్తా అంటూ శివాలెత్తిపోయాడు. ఈసారి మాంచి దూకుడు మీదున్న జగన్.. మొదటి నుంచి స్పీకర్ ప్రవర్తనపై ఆవేశకావేశాలకు పోతున్నాడు. కోడెలనే టార్గెట్ చేసుకుని మండిపడుతున్నాడు.

ఈ విషయంలో మాత్రం తెలంగాణ చాలా బెటరనే చెప్పుకోవాలి. అక్కడ కేసీఆర్- జానారెడ్డి మధ్య ఇలాంటి సీన్లు మచ్చుకైనా కనిపించడం లేదు. సీఎల్పీ నేత జానారెడ్డి టీఆర్ఎస్ పట్ల చాలా మెతకగా వ్యవహరిస్తున్నట్టు విమర్శలు వస్తున్నా.. ఆయన మాత్రం పద్దతిగానే నడుచుకుంటున్నాడు. ఇక కేసీఆరైతే.. జానారెడ్డికి విపరీతమైన గౌరవం ఇస్తూ మాట్లాడుతున్నారు. ఈ విషయంలో మాత్రం ఇలాంటి సీన్లు ఆంధ్రా నుంచి ఊహించలేం. కాకపోతే.. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం కంటే కొసరు పక్షం టీడీపీనే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ.. ఆ లోటు తీరుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: