చైనా.. ఆ దేశాన్ని పూర్తిగా తొక్కేసేందుకు కుట్ర పన్నుతోందా..?

Chakravarthi Kalyan
చైనా.. ప్రపంచానికే ప్రమాదకారిగా మారుతున్న దేశం.. ఇక తన అదుపులో ఉన్న ప్రాంతాలను తేలిగ్గా వదులుతుందా.. ఇప్పుడు అదే పని మరోసారి చేసింది. తన ఆధీనంలోని హాంకాంగ్‌ పై మరింతగా పట్టు బిగుస్తోంది. ఇప్పుడు తాజాగా హాంకాంగ్‌ స్వయం ప్రతిపత్తిపై చైనా ఉక్కుపాదం మోపింది. సంస్కరణల పేరుతో అక్కడి ప్రజాస్వామ్య పాలనను పరిమితం చేస్తోంది. హాంకాంగ్‌ చట్టసభకు ప్రజలు ఎన్నుకునే సభ్యుల సంఖ్యను తగ్గించేసింది. ప్రభుత్వం ద్వారా నామినేట్‌ అయ్యే సభ్యుల సంఖ్యను పెంచబోతోంది.

చైనా తీసుకున్న  ఈ నిర్ణయంతో హాంకాంగ్‌ స్వయంప్రతిపత్తికి చేటుగా మారనుంది. ఇలా ఒక్కో అడుగు వేసుకుంటూ హాంకాంగ్‌లో పాలనపై పూర్తి నియంత్రణ సాధించేందుకు చైనా ప్లాన్ వేస్తోంది. ఈమేరకు నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ సమావేశంలో కమ్యూనిస్ట్‌ పార్టీ నిర్ణయం తీసుకుంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సహా మొత్తం 2 వేల 895 మంది సభ్యులు హాంకాంగ్‌ సంస్కరణల తీర్మానాన్ని ఏకగీవ్రంగా ఆమోదించారు. అయితే హాంకాంగ్ చట్టసభలో ఎంతమంది సభ్యులను చైనా నియమిస్తుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. దాదాపు 33 శాతం మందిని నియమించే అవకాశం ఉందట.

హాంకాంగ్ స్వయంప్రతిపత్తిని చైనా కాలరాస్తోందనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే చైనా మాత్రం తాను హాంకాంగ్ రక్షణ, స్థిరత్వం కోసమే  సంస్కరణలు ప్రవేశపెట్టినట్లు చెప్పుకుంటోంది. అయితే.. స్వయంప్రతిపత్తిని కల్పించాలని కోరతూ హాంకాంగ్‌లోని ప్రజాస్వామ్య వాదులు 2019నుంచి ఉద్యమం చేస్తున్నారు. ఈ ఉద్యమాన్ని అణచిన చైనా ఎందరినో జైళ్లలో పెడుతోంది. దేశద్రోహం కింద కేసులు పెట్టి వేధిస్తోంది.

అందుకే హాంకాంగ్ లో తరచూ నిరసనలు జరుగుతుంటాయి. లక్షల మంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ గొంతును వినిపిస్తుంటారు. హాంకాంగ్ 150 ఏళ్లకుపైగా బ్రిటిష్ పాలనలో ఉంది. 1842లో హాంకాంగ్ ద్వీపాన్ని చైనా బ్రిటన్‌కు అప్పగించింది. 1997లో హాంకాంగ్ చైనాలో భాగంగా మారుతుందని ఇరు దేశాలూ అంగీకరించాయి. దీని ప్రకారం చైనాలో భాగంగా ఉన్నా, విదేశాంగ, రక్షణ వ్యవహారాలు తప్ప మిగతా అంశాల్లో హాంకాంగ్‌కు 'అత్యున్నత స్థాయి స్వయంప్రతిపత్తి' ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: