విషాద ఘటన.. భార్యను చంపి భర్త ఆత్మహత్య.. కారణాలు ఇవే..!?

N.ANJI
సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. ఒక్కరి చేతిలో మరొక్కరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మధ్య కాలంలో ఆత్మహత్యలు, హత్యలు పెరిగిపోతున్నాయి. క్షణికావేశంలో ప్రాణాలు తీయడానికి, తీసుకోవడానికి కూడా వెనకాడడం లేదు. చిన్న చిన్న కారణాలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కుటుంబ కలహాలతో ఒక్కరు, ప్రేమ వ్యవహారంతో మరొక్కరు, వివాహేతర సంబంధాల వలన మరికొంత మంది ఇలా ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. హైదరాబాద్‌ పంజాగుట్ట పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆర్థిక సమస్యలో, కుటుంబ సమస్యలో తెలియదు కానీ ఓ వ్యక్తి తన భార్యను చంపి తాను సూసైడ్ చేసుకున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సుబ్బారావు, సాయిలక్ష్మీ దంపతులు యూసుఫ్ గూడ రహమత్ నగర్‌లో నివసిస్తున్నారు. గత కొంత కాలంగా బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతంతో బాధపడుతున్న సాయిలక్ష్మీని భర్త సుబ్బారావు గురువారం సాయంత్రం పంజాగుట్ట స్వరాగ్ ఆస్పత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న కూకట్ పల్లిలో నివసించే వారి కుమార్తె అదేరోజు రాత్రి 7.30 సమయంలో వచ్చి చూసి వెళ్లారు. వైద్యులు కూడా ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.
అయితే శుక్రవారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో భార్యాభర్తలు ఇద్దరూ అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన ఆస్పత్రి సిబ్బంది కుమార్తెకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే పరీక్షించిన వైద్యలు భార్య సాయిలక్ష్మీ మరణించినట్టు నిర్థారించారు. సుబ్బారావు అపస్మారక స్థితిలో ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఉస్మానియాకు తరలించారు. ఉస్మానియాలో చికిత్స పొందుతూ సుబ్బారావు కూడా మరణించాడు.
ఇక ఇదిలా ఉండగా, ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులను ఎదుర్కుంటున్న కారణంగానే అనారోగ్యంతో ఉన్న భార్యను చంపి, భర్త సుబ్బారావు విషం తీసుకున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు ఉన్నందునే మరణిస్తున్నట్టు సూసైడ్ నోట్ లభించింది. కుమార్తె ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: