పురపోరు : తాడిపత్రిలో రంజుగా రాజకీయం.. వైసీపీకి ట్విస్ట్ ఇచ్చిన ప్రభాకర్ రెడ్డి

Chaganti
మున్సిపల్ ఎన్నికలను కూడా అధికార వైసీపీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఎలా అయినా మెజార్టీ మున్సిపాలిటీలు వైసీపీ ఖాతాలో ఉండేలా ఆ పార్టీ నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అనంతపురం జిల్లా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మున్సిపాలిటీలలో తాడిపత్రి కూడా ఒకటి. ఈ మున్సిపాలిటీలో చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు గాను అటు అధికార వైసీపీ సహా ప్రతిపక్ష టీడీపీ కూడా అనేక వ్యూహాలు రచిస్తోంది. ఇక్కడ వైసీపీ నుంచి ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా కేతిరెడ్డి పెద్దారెడ్డి కొనసాగుతున్నారు.

 ఆయన తన కొడుకు చేత నామినేషన్ వేయించి తాము చైర్మన్ రేసులో ఉన్నామని సంకేతాలు పంపారు. మరోపక్క టిడిపి నుంచి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్ గా పోటీ చేస్తూ ఉండడంతో ఉత్కంఠ నెలకొంది. అందుకే ముఖ్య నేతలు రంగంలోకి దిగి వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తూ గెలిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ వైసీపీకి షాక్ తగిలే ఘటన చోటు చేసుకుంది. తాడిపత్రిలో 4వ వార్డు మున్సిపల్ కౌన్సిల్ వైసీపీ రెబల్  అభ్యర్థి రిటైర్డ్ ఉద్యోగి షేక్ అబ్దుల్ రహీం జేసీ ప్రభాకర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.

 4వ వార్డులో టిడిపి అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో ఏకగ్రీవం అవుతుందని భావించిన వైసీపీ నాయకులు ఈ హఠాత్పరిణామంతో షాక్ కు గురయ్యారు. ఈ సందర్భంగా రహీం మాట్లాడుతూ తాడిపత్రి మున్సిపాలిటీని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దిన జేసీ ప్రభాకర్ రెడ్డి నాయకత్వంలో పని చేయడం తనకు ఎంతో ఆనందం కలిగిస్తున్నదని అన్నారు. టీడీపీ మద్దతు అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు "బకెట్" గుర్తు ఎన్నికల కమిషన్ కేటాయించిందని ఆయన తెలిపారు. అభివృద్ధి నినాదంతో జేసీ ప్రభాకర్ రెడ్డి నాయకత్వంలో ముందుకు వెళ్తున్న తనకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: