నకిలీ నోట్లతో భయం భయం..

Deekshitha Reddy
పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్లాక్ మనీ తగ్గిపోతుందనే భావనతోపాటు, నకిలీ కరెన్సీ బెడద కూడా తగ్గిపోతుందని అనుకున్నారంతా. కానీ పాత నోట్ల కంటే, కొత్త నోట్ల ప్రింటింగ్ విషయంలోనే అక్రమార్కులు తెలివి మీరిపోయారనే విషయం అప్పుడప్పుడూ బయటపడుతోంది. తాజాగా ఒడిశాలో నకిలీ నోట్లు చలామణికి ప్రయత్నించిన ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రూ.7.90 కోట్ల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఒడిశాలోని కొరాపుట్‌ జిల్లా పొటాంగి పరిధిలోని సుంకీ అవుట్‌ పోస్టు వద్ద నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ వ్యవహారంలో నలుగురిని అరెస్ట్‌ చేశారు. వాహనాల తనిఖీ సమయంలో వీటిని గుర్తించామని కోరాపుట్‌ ఎస్పీ తెలిపారు. నకిలీ నోట్లు తరలిస్తున్న కారుకు ఛత్తీస్‌ గఢ్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఉందని, రూ.500 డినామినేషన్ ఉన్న నోట్లను పెద్ద సంచుల్లో తరలిస్తున్నారని తెలిపారు. రాయ్‌పూర్‌ నుంచి విశాఖపట్నంలోని వ్యక్తికి నకిలీ నోట్లు అందించేందుకు నిందితులు వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.
గతంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా ఇలాగే నకిలీ కరెన్సీని పట్టుకున్నారు పోలీసులు. కోల్‌కతా సరిహద్దు బంగ్లాదేశ్‌ వద్ద ఉన్న సిలిగురి ప్రాంతం నుంచి నకిలీ నోట్లు దేశవ్యాప్తంగా సరఫరా అవుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి నకిలీ నోట్లను సరఫరా చేసుకోవడం కోసం కొందరు ముఠాగా ఏర్పడినట్టు.. సిలిగురి వెళ్లి అక్కడి నుంచి రైళ్లు, బస్సులు, అవసరమైతే లారీల్లో కూడా సూట్‌కేసులలో దుస్తుల కింద అమర్చి నకిలీ నోట్లను తీసుకొస్తున్నట్లు సమాచారం ఉంది. ఎక్కువగా రూ.100, రూ.500 నకిలీ నోట్లు చలామణి అవుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏటీఎంలలో నకిలీ నోట్లు వస్తే ఏంచేయాలి..?
ఇటీవలి కాలంలో నేరుగా నకిలీ నోట్లు ఏటీఎంలలో కూడా వస్తుండడంతో ఖాతాదారులు బెంబేలెత్తుతున్నారు.  ఖాతాదారులకు ఏటీఎం ద్వారా నకిలీ నోట్లు వస్తే వెంటనే బ్యాంకును సంప్రదించాలి. అక్కడ పట్టించుకోకపోతే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. డ్రా చేసిన రశీదును దగ్గర పెట్టుకోవాలి. నకిలీ నోట్లు నంబర్‌ ను స్కాన్‌ చేసినప్పుడు తెలిసిపోతుంది. నకిలీ నోట్లు చలామణి చేస్తున్నట్లు తెలిస్తే డయల్‌ 100కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: