విశాఖ స్టీల్ ఫ్యాక్ట‌రీ ఇక ప్రైవేటీక‌ర‌ణ త‌ప్ప‌దా...? మోదీ మాట‌ల్లో అర్థం అదేగా..!

Spyder
విశాఖ స్టీల్ ఫ్యాక్ట‌రీ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం చాలా స్ప‌ష్ట‌మైన వైఖ‌రితో ఉంద‌న్న విష‌యం అర్థ‌మ‌వుతోంది. ఈ విష‌యంలో రాష్ట్రంలో అధికార పార్టీ స‌హా ఇత‌ర పార్టీల నాయ‌కులు మేం సాధిస్తాం.. మేం కేంద్రాన్ని ఒప్పింస్తామంటూ వాగ్ద‌నాలు చేస్తున్న నేప‌థ్యంలో ప్ర‌ధాన‌మంత్రి మోదీ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. న‌ష్టాల్లో ఉన్న‌ ప్ర‌భుత్వ‌రంగ సంస్థ‌ల‌ను ఇక ఎంత‌మాత్రం న‌డ‌ప‌బోమ‌ని తెలియ‌జేశారు. ఇది విశాఖ స్టీల్ ఫ్యాక్ట‌రీకి వ‌ర్తిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. అస‌లు వ్యాపారం అన్న‌ది ప్ర‌భుత్వం యొక్క ప‌ని కాదంటూ పేర్కొన‌డం గ‌మ‌నార్హం. చాలా కాలంగా వస్తున్నాయని చెప్పి, నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను నడపలేమని ఆయన స్పష్టం చేశారు.

నాలుగు వ్యూహాత్మక రంగాలు మినహా అన్ని ప్రభుత్వం సంస్థల‌ను ప్రైవేటీకరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో  పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న వేళ.. ప్రభుత్వ రంగ సంస్థల ప్రవేటీకరణపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్య‌ల‌కు తెలుగు రాష్ట్రాల్లో ప్రాధాన్యం ఏర్ప‌డింది.విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మారుమోగుతోంది. ఆందోళనలతో విశాఖ నగరం అట్టుడుకుతోంది. బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమంలో భాగమవుతున్నాయి. కార్మిక, విద్యార్ధి సంఘాలకు తోడు, కార్మిక సంఘాలు దీక్షలు చేస్తున్నాయి.

 సీఎం జగన్ సైతం కార్మిక సంఘాలతో మాట్లాడి స్టీల్ ఉత్పత్తకి అంతరాయం లేకుండా ఉద్యమం చేసుకోవాలని సూచించారు. అధికార పార్టీకి చెందిన ప్ర‌జాప్ర‌తినిధులు కూడా నిర‌స‌న‌ల్లో పాల్గొంటున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి 25 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. చంద్రబాబు, లోకేష్ లు విశాఖ వచ్చి స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. అటు సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరూ ప్రధాని మోదీకి లేఖలు కూడా రాశారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.. బీజేపీ,జనసేన నేతలు ఢిల్లీలో వెళ్లి కేంద్ర పెద్దలను కలిశారు. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా కేంద్రం మాత్రం ప్రైవేటీకరణ పై ముందుకే అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతోంది. అయితే ఇంత చేస్తున్న కేంద్ర ప్ర‌భుత్వం నుంచి మాత్రం సానుకూల‌త వ్య‌క్తం కావ‌డం లేద‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: