కొత్త శోభను సంతరించుకున్న యాదాద్రి.. ప్రత్యేకతలేంటో తెలుసా..!

N.ANJI
సీఎం కెసిఆర్ అధికారంలోకి వచ్చాక యద్రాది పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టిన సంగతి అందరికి తెలిసిందే. అయితే యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా ప్రధాన స్థపతితో పాటు పదకొండు మంది ఉపస్థపతులు, రెండువేల మంది శిల్పులు తొలి సంవత్సరం పని చేశారు. తరువాత సంవత్సరంలో పదిహేనువందల మంది శిల్పులు విధులు నిర్వహించారు. ఈ శిల్పుల్లో తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల వారున్నారు. ప్రధానాలయ పునర్నిర్మాణం కోసం వైటీడీఏ రూ.200 కోట్లు ఖర్చు చేసింది. ప్రపంచంలోనే మొదటి రాతి దేవాలయంగా లక్ష్మీ నరసింహ స్వామి గుడి నిర్మతమైంది. ఇందుకు తగ్గట్టుగానే ఈ గుడిని విశిష్టంగా నిర్మించారు.
ఇందులో ప్రత్యేకమైన కృష్ణశిలను అలాగే.. వేంచేపు మండపం, బ్రహ్మోత్సవ మండపం, అష్టభుజి ప్రాకార మండపాలను తీర్చిదిద్దారు. వంద సంవత్సరాలకు ముందు నిర్మించిన అనుభూతి భక్తులకు కలిగే విధంగా రాతి కట్టడాలతో యాదాద్రి ఆలయాన్ని నిర్మించారు. పాత ఆలయం చుట్టూ సిమెంట్‌ కట్టడాలను విడతలు విడతలుగా చేపట్టారు. ప్రస్తుతం గర్భాలయాన్ని అలాగే ఉంచి దాని చుట్టూ పదునైన గోడను నిర్మించారు. ఆలయంలోకి భక్తులు సులువుగా వెళ్లేందుకు వీలుగా ముఖ ద్వారాన్ని కూడా వెడల్పు చేశారు.
గతంలో దేవాలయం చుట్టూ రథం, స్వామి వారి సేవ తిరగడానికి మూడు వైపుల్లో మాత్రమే స్థలం ఉండేది. దక్షిణం దిక్కున 120 అడుగుల రిటైనింగ్‌ వాల్‌ నిర్మించి ఆలయానికి దక్షిణ భాగంలో స్థలం పెంచారు. గర్భాలయాన్ని మధ్యగా లెక్కిస్తూ పూర్తి అలయ నిర్మాణం చేపట్టారు. ముఖమండప స్థలం పెంచారు. గతంలో పదివేల మంది భక్తులకు వీలుండే చోటును ఇప్పుడు ముప్పయి నుంచి నలభై వేల మంది వచ్చిపోయేందుకు వీలుగా విస్తరించారు. చుట్టూ ప్రాకార, అష్టభుజి మండపాలు నిర్మించారు.
అయితే ప్రధానాలయంలో గతంలో ఉన్న విధంగానే ధ్వజస్తంభం, బలిపీఠం, గరుడ ఆలయం, ఆండాళ్‌ అమ్మవారు, ఆంజనేయస్వామి ఆలయాలున్నాయి. ఇందులో అదనంగా సేనా మండపం, ఆళ్వార్, రామానుజుల ఉప ఆలయాలను నిర్మించారు. తూర్పు ద్వారం గుండా ఆలయంలోకి భక్తులు వచ్చి, పడమటి రాజగోపురం నుంచి భక్తులు వెళ్లే మార్గంలో రాతి మెట్లకు రాతి రెయిలింగ్‌ను ఏర్పాటు చేయడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: