ఈవాచ్ యాప్ పై హైకోర్టు సంచలన నిర్ణయం..!
ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల పర్యవేక్షణ కోసం.. ఎస్‌ఈసీ ఈ-వాచ్ పేరిట కొత్త యాప్‌ను తీసుకురావడం వివాదాస్పదమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న యాప్‌లను కాదని సొంతంగా ఈ యాప్‌ను రూపొందించింది ఎస్ ఈసీ. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ యాప్‌ను ఇప్పటికే లాంచ్ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు, ప్రలోభాల పై ఫిర్యాదులు అందుకోవటం కోసమే ఈ యాప్ అంటోంది ఎస్‌ఈసీ.
అయితే ఈ యాప్‌ను ఎక్కడ తయారు చేశారు, ఎవరు నిర్వహిస్తున్నారు? డేటా బేస్ ఎక్కడ స్టోర్ అవుతుంది? యాప్‌లో పొందుపరిచిన సమాచారం పై భద్రత ఎంత? ఫిర్యాది దారులు పంపించే ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్, ఎడిటింగ్ చేసే అవకాశాల పై ఉన్న అనుమానాలు, ఒక వర్గం వారి ఫిర్యాదులను మాత్రమే యాప్‌లో డిస్‌ప్లే చేసే సాంకేతిక వెసులుబాటు... తదితర అంశాలపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీన్ని వెంటనే నిలుపుదల చేయాలంటూ.. తిరిగి ఎస్‌ఈసీకే ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు.
అనుమానాల పై ఎటువంటి స్పష్టత ఇవ్వకుండా.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ వాచ్ యాప్‌ను విడుదల చేయడంతో కోర్టు తలుపు తట్టింది ప్రభుత్వం. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పంచాయతీ రాజ్ శాఖ రూపొందించిన యాప్ అందుబాటులో ఉంది. అదే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీ- విజిల్ పేరుతో ఒక యాప్ అందుబాటులో ఉంచింది. వీటిని ఉపయోగించుకోకుండా వివిదాస్పద యాప్ విడుదల చేయాల్సిన అవసరం ఏంటని ప్రభుత్వ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఎస్‌ఈసీకి పోటీగా.. నేత్ర పేరుతో మరో యాప్‌ను తీసుకొచ్చింది వైసీపీ. దీంతో, ఇప్పటికే ఉన్న నిప్పుల కుంపటికి ఈ యాప్ మరింత ఆజ్యం పోసిందనే అభిప్రాయం రాష్ట్ర రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.