దేవుడా: ప్లేట్ ఇడ్లీ రేటు అక్షరాలా రూ. 700.. ఎక్కడంటే..!?

N.ANJI
మనకు తెలిసినంత వరకు ప్లేట్ ఇడ్లీ ధర 30 రూపాయలు ఉంటుంది. అయితే హైదరాబాద్ నగరంలోని ప్రైవేట్‌ ఆస్పత్రులకు డబ్బు జబ్బు పట్టుకుంది. కరోనా మహమ్మారితో ప్రజలు ఆందోళన చెందుతుంటే ఆ ముసుగులో ప్రైవేట్‌ ఆస్పత్రులు ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నాయి. ఆరోగ్య శ్రీ ఉన్నా పట్టించుకోకుండా కరోనా చికిత్సకు రూ. లక్షల్లో దండుకుంటున్నాయి.
ఇక కరోనా విపత్తులోనూ కార్పొరేట్‌ ఆస్పత్రులు ధనదాహంతో రెచ్చిపోతున్నాయి. బిల్లులు చూస్తే గుండె గుబేలుమంటోంది. ఏ చికిత్స కోసం వెళ్లినా కోవిడ్‌ పరీక్ష చేయించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. అత్యవసర సేవల పేరుతో భారీ మొత్తంలో ఫీజులు గుంజుతున్నాయి. కాసుల కక్కుర్తితో నిబంధనలకు తూట్లు పొడుస్తున్నాయి. తాజాగా ఓ రోగికి వేసిన బిల్లును చూస్తే షాక్ తినాల్సిందే. మరి దారుణంగా ప్లేట్ ఇడ్లీకి అక్షరాలా 700 రూపాయల బిల్లును వసూలు చేసింది ఓ కార్పోరేట్ ఆస్పత్రి.

ఆ బిల్లును రోగి తరుపు బంధువు ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. " ఓ ప్రైవేట్ ఆస్పత్రి ప్లేట్ ఇడ్లీకి 700 రూపాయల బిల్లు వేసింది. ఆ ఇడ్లీలు ఏమైనా స్వర్గం నుంచి వచ్చాయా. ఇడ్లీలు బిల్లే కాదు మిగతా వాటి గురించి ఏంటి.." అంటూ అతడు ప్రశ్నించాడు. అయితే, అతడు చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు చురుగ్గా స్పందించారు. ఆ ఆస్పత్రి ప్రవర్తించిన తీరు దారుణమని, ఇందులో మానవత్వమే లేదని విమర్శించారు. ఈ ఇడ్లీలు స్పెషల్ గా ఆకాశాన్ని నుంచి తెప్పించి ఉంటారు అని వ్యంగ్యంగా సెటైర్లు వేస్తున్నారు.
అయితే ఇంకొందరు తమకు ప్రైవేట్ ఆస్పత్రుల వల్ల జరిగిన అన్యాయం గురించి చెప్పుకోని వాపోతున్నారు. మొత్తానికి ప్రైవేట్ ఆస్పత్రులు ప్యాకేజీ రూపంలో దోపిడీకి తెరలేపాయ్. కరోనా కాలంలో ఇలాంటి ఘటనలు మనం ఎన్నో చూశాం. కానీ ప్లేట్ ఇడ్లీకి 700 రూపాయలు వసూలు చేయడం దారుణమంటున్నారు నెటిజన్లు. ప్రభుత్వాలు ఇలాంటి కార్పోరేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: