కేశినేని మ‌రో సీటు కోసం పావులు క‌దుపుతున్నాడుగా... !

VUYYURU SUBHASH
బెజ‌వాడ‌లో టీడీపీ రాజ‌కీయాలు రోజుకో మ‌లుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా ఎంపీగా రెండోసారి గెలిచిన కేశినేనినాని.. త‌న‌దైన వైఖ‌రితో ముందుకు సాగుతున్నారు. ఎవ‌రినీ ప‌ట్టించుకోక‌పోగా.. ఏ స‌మ‌స్య‌నూ ప‌రిష్క‌రించేందుకు ఆయ‌న ఆస‌క్తి చూపించ‌డం లేదు. పైగా పార్టీ త‌ర‌ఫున కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేందుకు కూడా ఆయ‌న ముందుకు రావ‌డం లేదు. ఇక‌, నేత‌ల‌తోనూ క‌లివిడిగా ఉండ‌డం లేదు. పార్టీ త‌ర‌ఫున స‌మావేశాల‌కు కూడా మొక్కుబ‌డిగానే హాజ‌రవుతున్నార‌ని అంటున్నారు సీనియ‌ర్లు. ఇదిలావుం టే.. ఆయ‌న స్థానిక ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ మేయ‌ర్ పీఠాన్ని త‌న కుమార్తె శ్వేత‌కు ఇప్పించుకునేందుకు పావులు క‌దిపి.. అప్ప‌ట్లో స‌క్సెస్ అయ్యారు.

అయితే.. ఇప్పుడు స్థానికం వాయిదా ప‌డ‌డం.. ఈ గ్యాప్‌లో పార్టీకి-కేశినేనికి మ‌ధ్య గ్యాప్ మ‌రింత పెరగ‌డంతో ఇప్పుడు మేయ‌ర్ పీఠాన్ని త‌మ‌కు ఇవ్వ‌మంటే..త మ‌కు ఇవ్వ‌మ‌ని బొండా ఉమా స‌తీమ‌ణి సుజాత‌, గ‌ద్దె రామ్మోహ‌న్ స‌తీమ‌ణి.. అనురాధ‌లు ప‌ట్టుబ‌డుతున్నారు. ఈ వివాదం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఇదిలావుంటే.. మ‌రోవైపు వ‌చ్చే నెల‌లో.. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా పార్టీలో ఇంచార్జ్‌ల‌ను నియ‌మించేందుకు చంద్ర‌బాబు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం ఖాళీగా ఉన్న ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం బాధ్య‌త‌ల‌ను త‌న వారికి ఇప్పించుకునేందుకు కేశినేని ప‌ట్టుబ‌డుతున్న‌ట్టు తెలుస్తోంది.

గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి వ‌చ్చి.. టీడీపీలో చేరిన జ‌లీల్ ఖాన్ కుమార్తె ఖ‌తూన్ ఇక్క‌డ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే.. ఆ ఓట‌మి త‌ర్వాత ఖ‌తూన్ అమెరికా వెళ్లిపోవ‌డం, అనారోగ్య కార‌ణాల‌తో జ‌లీల్ కూడా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉండ‌డంతో పార్టీ ప‌రిస్థితి డోలాయ‌మానంలో ప‌డింది. దీంతో ఇక్క‌డి బాధ్య‌త‌లు చూసేందుకు, పార్టీని న‌డిపించేందుకు ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. వ‌చ్చినా.. చంద్ర‌బాబు ఇప్ప‌టి వ‌ర‌కు ఎఎవ‌రికీ అవ‌కాశం ఇవ్వ‌లేదు. ఈ నేప‌థ్యంలో రేపో మాపో.. నియోజ‌క‌వ‌ర్గాల ఇంచార్జ్‌ల‌ను నియ‌మించే అవ‌కాశం ఉంద‌ని తెలియ‌డంతో కేశినేని నాని.. త‌న వారికి అప్ప‌గించుకునేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు.

ఈ విష‌యంలో ఆయ‌న‌ను ఢీ కొట్టే వారు సైతం ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు. గ‌తంలో నాగుల్ మీరా కొన్నాళ్లు ఇక్క‌డ చ‌క్రం తిప్పినా.. ఏ ఒక్క ఎన్నిక‌ల్లోనూ గెలుపు గుర్రం ఎక్క‌లేక పోయారు.దీంతో ఇప్పుడు కేశినేని ఈ నియోజ‌క‌వ‌ర్గంలో త‌న వారిని నిల‌బెట్టి ప‌ట్టు పెంచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని టీడీపీ సీనియ‌ర్లు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: