ఆ ఒక్క నిర్ణయంతో ఏపీ రూపురేఖలు మార్చేయబోతున్న జగన్..?

Chakravarthi Kalyan
ఏపీ సీఎం జగన్ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రూపు రేఖలు మారిపోబోతున్నాయి. ఇప్పటి వరకూ 13 జిల్లాలుగా ఉన్న ఏపీ ఇకపై రెట్టింపు జిల్లాలతో కొత్త చిత్రం రూపుదాల్చబోతోంది. ప్రస్తుతం ఉన్న లోక్‌సభ నియోజకవర్గాలనే జిల్లాలుగా మార్చుతామంటూ ఎప్పటి నుంచో చెబుతున్న వైసీపీ సర్కారు .. ఇప్పుడు ఆ ప్రతిపాదనను నిజం చేయబోతోంది. పార్లమెంటరీ నియోజకవర్గాల ప్రాతిపదికగా 26 జిల్లాల ఏర్పాటుకు జగన్ రంగం సిద్ధం చేశారు.
ప్రస్తుతం 13 జిల్లాలుగా ఉన్న ఏపీలో త్వరరో మరో 13 జిల్లాలు ఏర్పడబోతున్నాయి. అంటే మొత్తం 26 జిల్లాలు ఏర్పడనున్నాయి. ఇప్పటికే ఏపీలో 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఒక్కో ఎంపీ స్థానంలో ఒక్కో జిల్లా ఏర్పాటుకానుంది. ఒక్క అరకు ఎంపీ స్థానంలో మాత్రం రెండు జిల్లాలు రాబోతున్నాయి. అరకు లోక్‌సభ నియోజకవర్గంలో పాడేరు, పార్వతీపురం కేంద్రంగా రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. కేవలం జిల్లాల సంఖ్యలోనే కాదు..  రెవెన్యూ డివిజన్లలోనూ మార్పులు చేయబోతున్నారు.
కొత్తగా 9 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు చేస్తారట. అలాగే ప్రస్తుతమున్న వాటిలో మూడు రద్దు చేస్తారట. కొత్త మార్పుల తర్వాత ప్రతి జిల్లాలో 2, 3 డివిజన్లు ఉంటాయన్నమాట. బాపట్ల జిల్లాలో కొత్తగా బాపట్ల, చీరాల రెవెన్యూ డివిజన్లు రాబోతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా కొత్త పోలీసు జిల్లాల హద్దులపై కూడా పోలీస్ శాఖ కసరత్తు చేస్తోంది.
ఇక రద్దయ్యే డివిజన్ల విషయానికి వస్తే.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్‌ పరిధిలోని ఉదయగిరి నియోజకవర్గ మండలాలను కందుకూరు డివిజన్‌లోకి, ఆత్మకూరు నియోజకవర్గ మండలాలను నెల్లూరు డివిజన్‌లోకి చేరుస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా కుకునూరు డివిజన్‌ పరిధిలోని పోలవరం నియోజకవర్గ మండలాలను కొత్తగా ఏర్పాటయ్యే జంగారెడ్డి గూడెం డివిజన్‌లోకి చేరుస్తారు. తూర్పుగోదావరి జిల్లా ఎటపాక డివిజన్‌ పరిధిలోని రంపచోడవరం నియోజకవర్గ మండలాలను కొత్తగా ఏర్పాటయ్యే రంపచోడవరం డివిజన్‌లోకి చేరుస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: