ఇంత జరిగినా.. ఎందుకంత నిర్లక్ష్యం..!

NAGARJUNA NAKKA
కరోనా మహమ్మారి ఇంకా పోలేదు..! పైగా కొత్త కరోనా వేరియేంట్‌లు పుట్టుకొస్తున్నాయి‌..! ఓ వైపు అన్ని చోట్ల కరోనా నిబంధనలు పాటించాలని చెబుతుంటే.. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ నిర్వాహకులు మాత్రం లైట్‌ తీసుకుంటున్నారు. కనీసం ప్రయాణీకులకు శానిటైజర్లు కూడా అందుబాటులో ఉంచడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అసలే కరోనా కాలం..! మాస్క్‌ లేకుండా బయటికి వచ్చే పరిస్థితి లేదు. ఈ సమయంలోనూ ప్రయాణాలంటే మరింత జాగ్రత్త అవసరం..! కానీ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ నిర్వాహకులు మాత్రం వైరస్‌ను లైట్‌ తీసుకుంటున్నారు. ఓ వైపు ప్రభుత్వం చెబుతున్నా.. పట్టించుకోవడం లేదు. కోవిడ్‌ నిబంధనలను గాలికొదిలేసి బస్సులు నడిపిస్తున్నారు. కాసులొస్తే చాలు.. ఎవరు ఎలా పోతే మాకేంటి అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుత కరోనా సమయంలో బస్సుల్లో కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా.. అవేవి పట్టించుకోవడం లేదు. ఇష్టానుసారంగా బస్సుల్లో ప్రయాణికులను సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. కనీసం మాస్క్, సానీటైజర్లు కూడా బస్సుల్లో అందుబాటులో పెట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. లాక్ డౌన్ కారణంగా సుమారు ఆరు నెలల పాటు రోడెక్కని ప్రైవేటు ట్రావెల్స్ పండుగల సమయంలో రోడ్డెక్కేందుకు సిద్ధమయ్యాయి. అందులో ఏ బస్సు ఏ కండీషన్‌లో ఉందో ఎవరికీ తెలియదు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం వాహనాల త్రైమాసిక పన్నును కూడా రద్దు చేసింది.
సంక్రాంతికి కొత్త, పాత బస్సులన్నింటినీ రోడ్ల మీదికి వదిలేస్తున్నారు. అందుకే కోవిడ్ కారణంగా కోల్పోయిన ఆదాయాన్ని రాబట్టేందుకు ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు ప్రయాణికుల నుంచి ఇష్టారీతిన ఛార్జీలు పెంచేస్తున్నాయి. ఓ వైపు ఆర్టీసీ కరోనా భయంతో ఏసీ బస్సులు తగ్గిస్తే.. ప్రైవేట్‌ యాజమాన్యాలు మాత్రం ఏసీ పేరు చెప్పుకుని మరింత దండుకుంటున్నాయి.  
కరోనా కాలంలో అనేక మంది సొంత వాహనాల వైపు మొగ్గు చూపుతున్నా.. సామాన్యులు, మధ్యతరగతి, పేదోడు మాత్రం బస్సులనే ఆశ్రయిస్తున్నాడు. అయితే ఆర్టీసీ టిక్కెట్లు దొరక్కపోవడంతో.. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఆడిందే ఆట.. పాడిందే పాట తయారైంది. అయితే ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై ప్రభుత్వాలకు ఎందుకంత ప్రేమ అని నిలదీస్తున్నారు ప్రయాణీకులు. సామాన్యులను దోచుకుంటున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై చర్యలు తీసుకోవాలని.. ధరలను నియంత్రించాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: