పక్షుల మృత్యువాతతో జనాల్లో భయం..!
H5N1 వైరస్..! ఇదే బర్డ్ ఫ్లూకి కారణం..! ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్‌తో పాటు కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో చనిపోతున్న పక్షుల్లో ఈ వైరస్‌ను గుర్తించారు అధికారులు. దీంతో పాటు H5N8 వైరస్.. దీనిని ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా అంటారు. ఇది ఏవియన్ ఫ్లూ టైప్‌ఏ వైరస్ కారణంగా వస్తుంది. అడవి జలపక్షుల్లో ఇది సాధారణంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ వైరస్ హిమాచల్ ప్రదేశ్‌లో 2400 పక్షుల మరణానికి కారణమైంది. ఇందులో సగానికి పైగా వలస పక్షులే ఉన్నాయి. పాంగ్ డామ్ సరస్సు సమీపంలో ఇవి ప్రాణాలు కోల్పోయాయి. ఇందులో అధికంగా అడవి బాతులే ఉన్నాయి. సరస్సు మైదానం ప్రాంతాల్లో చనిపోవడంతో అటు వైపు ఎవరూ వెళ్లకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.
మొత్తం నాలుగు రాష్ట్రాలకు బర్డ్ ఫ్లూ భయం పట్టుకుంది. హిమాచల్ ప్రదేశ్‌లో ఈ వైరస్‌కి అడవి బాతులతో పాటు వలస పక్షులు చనిపోగా.. కేరళలో కోళ్లు, బాతులు మృత్యువాత పడుతున్నాయి. ఇక రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కాకులపై ఈ వైరస్ పంజా విసిరింది. రాజస్థాన్‌లో కొత్తగా 170 పక్షులు చనిపోయాయి. జలవార్ జిల్లాలో మాత్రమే బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిందని.. మిగతా జిల్లాలో ఈ వైరస్ లేదంటున్నారు అధికారులు. మధ్యప్రదేశ్‌లో ఇప్పటికే 155 కాకులు చనిపోయాయి. వీటిలో H5N8 వైరస్ ఉన్నట్లు గుర్తించారు. కేరళలోని కొట్టాయం, అలెప్పుజలో కూడా బాతులు, కోళ్లను చంపేస్తున్నారు. దాదాపు 40 వేల పక్షులను చంపేయాలని నిర్ణయించారు.