టీ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు ఎవరో తెలిసిపోయింది... ప్రకటనే తరువాయి...!
ఇక ఉత్తమ్ తన పదవికి రాజీనామా చేయడంతో చివరకు కొత్త పీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేయక తప్పని పరిస్థితి. దీంతో చాలా రోజులుగా పీసీసీ అధ్యక్ష రేసులో ఉన్న వారికి కాస్త ఆశలు కలుగుతున్నాయి. ఈ పదవిపై కన్నేసిన సీనియర్లు, అవుట్ డేటెడ్ లీడర్లు ఇప్పుడు లాబీయింగ్ స్టార్ట్ చేసేశారు. ఎవరికి వారు తామే పీసీసీ రేసులో ఉన్నామని ప్రకటించుకుంటున్నారు. ఓ వైపు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్యం ఠాగూర్ హైదరాబాద్‌లోనే మకాం వేసి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు.
టీ పీసీసీ రేసులో ప్రధానంగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 200 మంది కీలక నేతల అభిప్రాయాలు సేకరించారు. తాజాగా ఈ పదవి రేసులో కోమటిరెడ్డి కన్నా రేవంత్ రెడ్డి ముందు ఉన్నట్టు తెలుస్తోంది. రేపు రేవంత్‌కు ఢిల్లీ రమ్మని పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో జరిగే డిఫెన్స్ కమిటీ సమావేశంలో రాహుల్ గాంధీతో పాటు రేవంత్ పాల్గొనబోతున్నారు.
రాహుల్‌తో రేవంత్ భేటీ కానుండడంతో రేవంత్‌కే టీ పీసీసీ పీఠం దక్కుతుందన్న ప్రచారం అంతర్గతంగా జరుగుతోంది. అయితే రేవంత్‌కు తెలంగాణ కాంగ్రెస్‌లో అనుకూల వర్గం కంటే వ్యతిరేక వర్గమే ఎక్కువుగా ఉంది. మరి రేవంత్ అనుకున్నది సాధిస్తాడో ? లేదో ? చూడాలి.