రైతు మ‌న‌సు తెలిసిన ' ఏలూరి ' ... ఇలాంటి ఎమ్మెల్యే ఉంటే రైత‌న్నే హీరో

VUYYURU SUBHASH
సాధార‌ణంగా ఏ నాయ‌కుడైనా.. మాట‌లు చెప్ప‌డం వ‌ర‌కే ప‌రిమిత‌మ‌వుతారు. చేత‌ల విష‌యానికి వ‌చ్చేస‌రికి అచేత‌నంగా మారిపోతారు. ఇది స‌ర్వ‌సాధార‌ణంగా మ‌నం చూసే ప్ర‌క్రియే. పార్టీ ఏదైనా నాయ‌కులు ఎంత‌టి వారైనా.. న‌డుం వంచిన ప‌రిస్థితి మ‌న‌కు పెద్ద‌గా ఎక్క‌డా క‌నిపించ‌దు. అందుకే నేత‌లు పెద్ద‌గా రాణించిన రంగం అంటూ ఏదీ లేదు. డాక్ట‌ర్ కాబోయి నాయ‌కులు అయిన వారు.. యాక్ట‌ర్ అయి.. నాయ‌కులు అయిన వారు ఉన్నారు. కానీ.. వ్య‌వ‌సాయ రంగం నుంచి వ‌చ్చి.. నాయ‌కులు అయి.. అదే వ్య‌వ‌సాయంలో కీల‌క మైన గుర్తింపు పొందిన వారు.. రైతుల‌కు బాస‌ట‌గా ఉన్న వారు చాలా చాలా అరుదుగా క‌నిపిస్తారు. నిజానికి చాలా మంది నాయ‌కులు తాము వ్య‌వ‌సాయ కుటుంబాల నుంచి వ‌చ్చామ‌ని చెప్పుకొంటారు.
అయితే.. వ్య‌వ‌సాయ రంగం గురించి ఓ గంట మాట్లాడ‌మ‌ని కానీ.. పొలంలోకి దిగి.. న‌డుం వంచ‌మ‌ని కానీ.. అడిగితే.. అమ్మో!! అని చేతులు ఎత్తేస్తారు. అంతేకాదు.. రైతుల‌కు విలువైన స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వ‌మ‌ని అడిగినా.. ఏదో మా తాత‌లు, తండ్రులు వ్య‌వ‌సాయం చేశారు కానీ.. మేం చేయ‌లేదు. ఏదో ఫ్లోలో అలా చెప్పేశాం! అని త‌ప్పించేసుకున్న నాయ‌కులు చాలా మంది మ‌న‌కు ఇప్ప‌టికీ ఉన్నారు. అయితే.. అంద‌రూ ఇలానే ఉన్నారా?  అన్ని పార్టీల్లోనూ ఇలా త‌ప్పించుకుని తిరిగే నాయ‌కులు ఉన్నారా? అంటే.. లేద‌నే అంటారు.. ప‌రుచూరు ఎమ్మెల్యే, టీడీపీ యువ నాయ‌కుడు ఏలూరి సాంబ‌శివ‌రావు గురించి తెలిసిన వారు ఎవ‌రైనా. ఆయ‌న స్వ‌తః సిద్ధంగా వ్య‌వ‌సాయ రంగం నుంచి రావ‌డ‌మే కాదు.. ఇప్ప‌టికీ.. లుంగీ బిగించి మ‌డిలోకి దిగితే.. ఆయ‌న ప‌నితీరే వేరేగా ఉంటుంది.
ఆద‌ర్శ‌వంత‌మైన రైతుగా ఏలూరి గుర్తింపు సాధించారు. ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గంలో స్వ‌యంగా ఆయ‌న కూడా వ్య‌వ‌సాయం చేస్తున్నారు. అయితే.. వ్య‌వ‌సాయం అన్నా.. రైతులు అన్నా.. క‌ష్టాలు.. క‌న్నీళ్లు త‌ప్ప ఏముంటుంద‌ని చెప్పుకొనే రోజుల్లో.. సాగును బాగు చేసి.. ఆదాయ మార్గంలో ప‌య‌నించేలా చేసిన అస‌లు సిస‌లు అన్న‌దాత‌గా ఆయ‌న రైతాంగంలో ప్ర‌త్యేక గుర్తింపు సాధించారు. నిజానికి ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గం సాగ‌ర్ ఆయ‌క‌ట్టుకు చివ‌రిలో ఉంటుంది. దీంతో ఆ నీటిని నియోజ‌క‌వ‌ర్గంలోని పొలాల‌కు త‌ర‌లించేలా ఏలూరి ఎంతో కృషి చేసి నీటిని సాధించారు.
అంతేకాదు... కేవ‌లం భారీ నీటితోనే వ్య‌వ‌సాయం చేయ‌డం అనే కాన్సెప్టును ప‌క్క‌న పెట్టి.. త‌న పొలంలో గ్రిప్ ఇరిగేషన్(బిందు సేద్యం) చేయ‌డంతోపాటు స్థానిక రైతుల‌కు కూడా దీనిపై అవ‌గాహ‌న క‌ల్పించారు. వ్య‌వ‌సాయాన్ని ఆదాయ వ‌న‌రుగా మార్చుకోవ‌డంలో మెళ‌కువలు గుర్తించి.. మిర్చి, బొప్పాయి వంటి పంట‌లను తాను సాగు చేస్తూ.. లాభాలు ఆర్జించ‌డ‌మే కాకుండా.. ఆయా పంట‌ల‌ విష‌యంలో డ్రిప్ ఇరిగేష‌న్ పై రైతాంగానికి అవ‌గాహ‌న క‌ల్పించారు. రైతులు క‌ష్ట‌ప‌డ‌కుండా.. వ్యవ‌‌సాయం చేయ‌డంతోపాటు.. ఆదాయం పెంపుపైనా దృష్టిపెట్టారు. దీంతో ఏలూరికి అన్న‌దాత‌ల్లో ప్ర‌త్యేక గుర్తింపు ల‌భించింది.
మ‌రీ ముఖ్యంగా మిర్చిసాగుకు ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న నేప‌థ్యంలో దీనిని మ‌రింత లాభ‌దాయం చేసుకునే మార్గాల‌పై ఆయ‌న దృష్టి పెట్టారు. త‌క్కువ ధ‌ర‌కు నారు వ‌చ్చేలా చేయ‌డంతో పాటు త‌క్కువ ఖ‌ర్చుతో ఎలా అధిక దిగుబ‌డులు సాధించాలో ఆయ‌న రైతుల‌కు సూచ‌న‌లు, స‌ల‌హాలు అందేలా చేస్తున్నారు. వ్య‌వ‌సాయంలో ఆయ‌న‌కు ఉన్న మ‌క్కువ‌, క‌ష్టాన్ని గుర్తించిన పార్టీ అధినేత చంద్ర‌బాబు ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి అప్ప‌గించారు. టీడీపీ నేతృత్వంలోని హైలెవ‌ల్ వ్య‌వ‌సాయ క‌మిటీలో సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడుతోపాటు.. ఏలూరికి కూడా అవ‌కాశం క‌ల్పించారు.
ఈ క‌మిటీ వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌పైనా.. రైతాంగ స‌మ‌స్య‌ల‌పైనా అధ్య‌య‌నం చేయ‌డంతోపాటు రైతుల‌కు వెన్నుద‌న్నుగా ఉండే కార్య‌క్ర‌మాల‌పై దృష్టి పెట్ట‌నుంది. అన్న‌దాత‌ల‌కు అన్ని విధాలా అండ‌గా ఉంటూ.. వారికి సూచ‌న‌లు స‌ల‌హాలు ఇవ్వ‌నుంది. ఆధునిక వ్య‌వ‌సాయ ప‌ద్ధ‌తుల‌పై అధ్య‌య‌నం చేయ‌డంతోపాటు.. రైతాంగం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై ప‌రిష్కారాల‌ను వెత‌క‌నుంది. ఇంత‌టి కీల‌క‌మైన ఉన్న‌త‌స్థాయి క‌మిటీలో ఏలూరికి చోటు ద‌క్క‌డంపై ఆయ‌న అభిమానులు, నియోజ‌క‌వ‌ర్గం రైతాంగం హ‌ర్షం వ్య‌క్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇలాంటి ఎమ్మెల్యేలు కొంద‌రు ఉన్నా దేశంలో రైత‌న్న నిజ‌మైన హీరో అవుతాడ‌న‌డంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: