నువ్వా.. నేనా అనేలా ఇరు జట్లు..!

NAGARJUNA NAKKA
ఆసీస్ తో జరుగనున్న చివరి మ్యాచ్‌లో గెల్చి, టీట్వంటీ సిరీస్ క్లీన్‌ స్వీప్‌ చేయాలని భావిస్తోంది కోహ్లీసేన. బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లో బలంగా కనిపిస్తున్న టీమిండియా.. మరోసారి అదేఫామ్ కనబర్చి, ఆసీస్‌కు వైట్‌వాష్ చేయాలన్న కసితో ఉంది. ఈ రోజు జరిగే చివరి టీట్వంటీలో తమ సత్తా చాటాలని ఇరుజట్లు కృతనిశ్చయంతో ఉన్నాయి.

వన్డేసిరీస్‌ను కోల్పోయిన టీమిండియా.. టీ ట్వంటీ పోరులో అదరగొడుతోంది. ఇప్పటికే సిరీస్ దక్కించుకున్న కోహ్లీసేన.. ఈ రోజు జరిగే చివరి మ్యాచ్‌లోనూ గెల్చి, క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. ఆటగాళ్లందరూ లయను అందుకోవడంతో ఆసీస్‌ను మరోసారి మట్టికరిపించడం భారత్‌కు కష్టమేమీ కాదు.  ఆల్‌రౌండర్‌ జడేజా గాయంతో జట్టుకు దూరమైనా, కీలక పేసర్లు బుమ్రా, షమికి విశ్రాంతినిచ్చినా సిరీస్‌ గెలవడం కోహ్లీసేనకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చింది.

పేసర్లు దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్‌, నటరాజన్ గొప్పగా రాణిస్తున్నారు. పేస్‌దళం బాధ్యతల్ని గొప్పగా నిర్వర్తిస్తున్నారు. యువ పేసర్‌ నటరాజన్‌ బౌలింగ్‌ అర్థం చేసుకోవడంలో ఆసిస్ బ్యాట్స్‌మన్ విఫలమవుతున్నారు. యార్కర్లు, ఆఫ్ కట్టర్లతో పాటు నెమ్మది బంతులతో కంగారూలను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. రెండో టీ20లో నటరాజన్‌ కట్డడిచేసిన పరుగులే భారత్‌ విజయంలో కీలకపాత్ర పోషించాయి. అతడితో పాటు శార్దూల్‌ ఠాకూర్‌ నకుల్ బంతులతో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ తన పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఆరో బౌలర్‌ లేకపోవడం భారత్‌కు ఇబ్బంది పెడుతోంది.

బ్యాటింగ్ విషయానికొస్తే రోహిత్, జడేజా గైర్హాజరీలోనూ టీమిండియా అత్యంత పటిష్ఠంగా ఉంది. కేఎల్ రాహుల్‌, హార్దిక్‌ పాండ్య సూపర్‌ ఫామ్‌లో ఉండటం, శిఖర్‌ ధావన్‌, విరాట్ కోహ్లీ పరిస్థితులకు తగ్గట్లుగా ఆడటం భారత్‌కు కలిసొస్తోంది. సంజు శాంసన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ భారీ షాట్లు స్కోరు వేగానికి దోహదపడుతున్నాయి. మనీష్‌ పాండే గాయం కారణంగా శ్రేయస్‌ ఆఖరి మ్యాచ్‌లోనూ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ్టి మ్యాచ్‌లోనూ భారత బ్యాట్స్‌మెన్ సమష్టిగా పోరాడితే ఆసీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

డేవిడ్ వార్నర్‌, ఆరోన్‌ ఫించ్‌, మిచెల్ స్టార్క్‌, హేజిల్‌వుడ్, కమిన్స్‌ జట్టులో లేకపోవడం ఆసీస్‌కు ప్రతికూలాంశంగా మారింది.

నేడు టీమిండియా, ఆసిస్ మధ్య చివరి టీట్వంటీ
క్లీన్‌ స్వీప్‌పై కన్నేసిన కోహ్లీసేన
బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో పటిష్టంగా కోహ్లీసేన
కీలక ఆటగాళ్లు లేకపోవడం ఆసిస్‌కు ప్రతికూలాంశం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: