ఏపీ స్కూళ్లలో ప్రైమరీ సెక్షన్ లేనట్టేనా..?

Deekshitha Reddy
లాక్ డౌన్ అనంతరం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలలు పునఃప్రారంభించడానికి వెనకడుగు వేస్తున్న టైమ్ లో ఏపీ ప్రభుత్వం ధైర్యంగా స్కూళ్లు తెరిచింది. రోజు మార్చి రోజు సగం మంది విద్యార్థులు పాఠశాలకు వచ్చేట్లు, ముందుగా 9, 10 తరగతుల క్లాసులు మొదలు పెట్టింది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ లో కూడా ఇదే విధానం పాటిస్తోంది. అయితే 6, 7, 8 తరగతుల విద్యార్థులకు మాత్రం మరో షెడ్యూల్ ప్రకటించింది. డిసెంబర్ 14నుంచి ప్రైమరీ సెక్షన్ కూడా మొదలు పెట్టాల్సి ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల విషయంలో ప్రభుత్వం రిస్క్ చేసేలా కనిపించడంలేదు.
రాష్ట్రంలోని స్కూళ్లలో తరగతుల ప్రారంభంపై ఇంతకు ముందు ఇచ్చిన జీవోకు స్వల్ప సవరణలు చేస్తూ పాఠశాల విద్యాశాఖ సోమవారం జీవో 229 విడుదల చేసింది. కోవిడ్‌ నేపథ్యంలో స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ను పాటిస్తూ తరగతులు నిర్వహించేందుకు పాఠశాలల్లో తగినంత స్థలం అందుబాటులో లేనందున ఈ సవరణ చేస్తున్నట్లు ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తాజా జీవో ప్రకారం డిసెంబర్‌ 14వ తేదీ నుంచి అన్ని స్కూళ్లలో 6, 7 తరగతులను మాత్రమే ప్రారంభిస్తారు. సంక్రాంతి సెలవల అనంతరం పరిస్థితులను బట్టి 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు. సూళ్లను ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు.
రాష్ట్రంలోని పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులకు క్లాసులు ప్రారంభించిన తొలిరోజే అత్యధిక సంఖ్యలో హాజరు నమోదైంది. ఈ నెల 2 నుంచి ఇప్పటి వరకు 9, 10 తరగతులకు బోధన జరిగింది. సోమవారం 8వ తరగతి విద్యార్థుల తరగతులు ప్రారంభించారు. 46.28 శాతం 10వ తరగతి విద్యార్థులు, 41.61 శాతం 9వ తరగతి విద్యార్థులు హాజరయ్యారు. 8వ తరగతి విద్యార్థులు అత్యధికంగా 69.72 శాతం హాజరయ్యారు. మొత్తం 5,70,742 మంది విద్యార్థులకు గాను 3,96,809 మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు.
అయితే ప్రైమరీ సెక్షన్ విషయంలో మాత్రం ప్రభుత్వం ఇంకా ఆలోచన చేస్తోంది. కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాతే 1 నుంచి 5వ తరగతి విద్యార్థులను స్కూళ్లకు అనుమతించాలని అనుకుంటున్నారు అధికారులు. ఆ లెక్కన చూస్తే.. ఈ విద్యాసంవత్సరంలో ఏపీలో ప్రైమరీ సెక్షన్ పూర్తిగా లేనట్టే చెప్పాలి. అందర్నీ ఆటోమేటిక్ గా పై తరగతులకు ప్రమోట్ చేసి సిలబస్ ని మదింపు చేస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: