3వేల మందికి ఉద్యోగాల భర్తీ..!
విదేశాల్లో ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. దీని కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన ఓంక్యాప్-ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 23వ బోర్డు మీటింగ్ ఆన్ లైన్ విధానంలో జరిగింది. పరిశ్రమల శాఖ మంత్రి చైర్మన్ గా ఉన్న ఈ సంస్థ తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యాలయంలో సమావేశం నిర్వహించింది.
గత ఏడాది కాలంలో ఓంక్యాప్ ద్వారా సుమారు 2వేల మంది యువతకు ఈ సంస్థ ద్వారా విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ప్రస్తుతం ఇంటిపని, వంటపని, ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్గు, నర్సులు, ఫోర్క్ లిఫ్ట ఆపరేటర్లు వంటి మరో 2వేల ఖాళీలు వివిధ దేశాల్లో భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. జర్మనీలో వెయ్యి మంది నర్సుల భర్తీకి అవకాశాలు ఉన్నాయి. దీంతో, జర్మన్ భాషతో పాటు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టారు అధికారులు.
విదేశాల్లో ఉన్న ఉద్యోగ అవకాశాల సమాచారం అందించేందుకు, సాంకేతిక సహకారం ఇచ్చేందుకు... ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ మైగ్రేషన్ సెంటర్ నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి కేంద్రాలను ప్రతి జిల్లాలోనూ ఎంపిక చేసిన ఎంప్లాయిమెంట్ ఆఫీసులు, ఐటిఐ, జిల్లా నైపుణ్యకేంద్రాలలో త్వరలోనే ప్రారంభిస్తారు.
కోవిడ్ కారణంగా విదేశాలకు వెళ్లలేకపోయిన వారి కోసం స్థానిక ఉద్యోగ ఆసరా లోకల్ ఎంప్లాయిమెంట్ సపోర్ట్ పేరుతో సంయుక్తంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాయి ఓంక్యాప్, ఎపిఎస్‌ఎస్‌డిసి. ఈ పథకంలో భాగంగా వివిధ దేశాల్లో ప్రస్తుతం, భవిష్యత్తులో ఉండబోయే ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఓంక్యాప్ కు ఇస్తోంది ఎన్ఎస్‌డిసి. అందుకు అనుగుణంగా అవసరమైన శిక్షణను తిరుపతి, విజయవాడ, కాకినాడ, వైజాగ్‌లలోని 4 ప్రభుత్వ ఐటిఐలు.. రాజమండ్రి, పులివెందులలోని 2 న్యాక్ సెంటర్లతో పాటు 2 ప్రైవేట్ సెంటర్లలో ఓంక్యాప్ ద్వారా శిక్షణ ఇస్తారు.