బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో..!

NAGARJUNA NAKKA
ఈశాన్య రుతుపవనాలు, బంగాళాఖాతంలో ద్రోణి ప్రబావంతో తమిళనాడు సహా ఆంధ్రప్రదేశ్ లోనూ పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరోవైపు.. నెల్లూరు జిల్లా కుండపోత వర్షాలతో తడిసిముద్దవుతోంది.

నెల్లూరు జిల్లాను కుండపోత వణికిస్తోంది. ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారాంపురం, ఉదయగిరి దుత్తలూరు, వరికుంటపాడు, వింజమూరు,కలిగిరి కొండాపురం, జలదంకి  ప్రాంతాలలో...ఏకధాటి వర్షానికి  రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఉదయగిరి నియోజకవర్గంలో పలు పంటలు...పూర్తిగా నీటమునిగాయి. మినుము పంట చేతికందే సమయానికి వర్షం రావడంతో.. కాయలు మొలకెత్తే పరిస్థితి ఉంటుందన్నారు రైతులు. కళ్ళముందే పంట నష్టపోతున్నామని ఆందోళన చెందుతున్నారు.

భారీ వర్షానికి నెల్లూరు జిల్లాలో పలు కాలనీలు నీట మునిగాయి. నగరంలోని బుజబుజ నెల్లూరు.. మాగుంట లేఔట్, లెక్చరర్స్ కాలనీతో పాటు రవీంద్రనగర్ ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. అండర్ రైల్వే బ్రిడ్జిల్లో నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లపై నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో బస్సులు ఆగిపోయాయి.

కొండాపురం మండలం నిడదవోలు అగ్రహారం సమీపంలో వాగు ఉగ్ర రూపం దాల్చింది. కొండాపురం నుంచి కావలి పరిసర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తమిళనాడులో చెన్నై సిటీ సహా పరిసర జిల్లాల్లో .. నేడు భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిన్న కూడా  మోస్తరు వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, కడలూరు, నాగపట్టణం, తిరువరూర్, మయిలదుత్తురాయ్ జిల్లాల్లో... భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావానికి తోడు నైరుతి బంగాళాఖాతంలో ద్రోణి ఏర్పడటంతో భారీ వర్షాలు కురుస్తున్నట్లు చెబుతోంది.

మరోవైపు తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయ్‌. చెన్నై సిటీలో వర్షాలు దంచికొడుతున్నాయ్. నగరంలో రోడ్లు నదుల్ని తలపిస్తున్నాయ్‌. కడలూరు, కోయంబత్తూరుల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనజీవనం అస్తవ్యస్తమైంది. చెన్నై నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈశాన్య రుతుపవనాలు, బంగాళాఖాతంలో ద్రోణి ప్రబావంతో రాబోయే 24 గంటల్లో తమిళనాడుకు భారీ వర్ష సూచన ఉందని ఐఎండీ హెచ్చరించింది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: