జైలుపక్షులు స్వేచ్ఛాలోకంలో విహరించే సమయం..!

NAGARJUNA NAKKA
జైళ్లలో సత్ప్రవర్తన కలిగి ఐదేళ్లు పూర్తి చేసుకున్న మహిళా ఖైదీలకు ఆంధ్రప్రదేశ్ లో విముక్తి లభించబోతోంది. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేయడంతో.. మహిళా ఖైదీలకు శిక్ష నుంచి మినహాయింపులపై ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.

వివిధ నేరాలు చేసి ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జైళ్లలో శిక్షను అనుభవిస్తున్న మహిళా ఖైదీల్లో.. సత్ప్రవర్తన కలిగి ఐదేళ్ల శిక్షా కాలాన్ని పూర్తి చేసుకున్న 55 మందిని విడుదల చేయబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జీవితఖైదు పడిన మొత్తం 147 మంది మహిళల్లో.. త్వరలో 55 మంది విడుదల కాబోతున్నారు. క్షణికావేశంలో నేరాలు చేసినా.. శిక్ష పడిన తర్వాత జైల్లో సత్ప్రవర్తనతో మెలుగుతున్న వారిని మానవతా దృక్పథంతో రిలీజ్‌ చేయాలని నిర్ణయించినట్లు హోంమంత్రి మేకతోటి సుచరిత చెప్పారు.

మహిళా ఖైదీల్లో సత్ప్రవర్తన కలిగేలా జైళ్లలో సంస్కరణలు తెచ్చామని.. వారికి టైలరింగ్, ఎంబ్రాయిడరీ, శారీ పెయింటింగ్, బేకరీ పదార్థాల తయారీ వంటి వాటిలో శిక్షణ ఇచ్చామని.. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని మహిళా ఖైదీలను విడుదల చేస్తున్నామని హోంమంత్రి చెప్పారు. కడప జైలు నుంచి అత్యధికంగా 27 మంది మహిళా ఖైదీలు, రాజమండ్రి జైలు నుంచి 21 మంది, నెల్లూరు జైలు నుంచి 5 మంది, విశాఖపట్నం జైలు నుంచి ఇద్దరు మహిళా ఖైదీల్ని విడుదల చేయబోతున్నామని వెల్లడించారు.

మహిళలు జైళ్లకు వెళ్లడం వల్ల వారి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని.. విడుదల అయిన  తర్వాత ఎలాంటి నేరాలకు పాల్పడకుండా అయినవారితో కలిసి సంతోషంగా జీవితం గడపాలని ఖైదీలకు సూచించారు హోంమంత్రి. మొత్తానికి త్వరలో జైలు పక్షులు స్వేచ్ఛాలోకంలో విహరించబోతున్నాయి. ఇన్నాళ్లూ క్షణికావేశం వల్ల.. తెలిసో.. తెలియకో చేసిన నేరానికి ఐదేళ్లు జైలు శిక్ష అనుభవించారు. తమ తప్పు తాము తెలుసుకొని బుద్దిగా మెలిగారు. ఇది గమనించిన అధికారులు ప్రభుత్వానికి రిపోర్ట్ చేయడంతో.. ఆ మహిళలు జైలు జీవితం నుంచి విముక్తి కలిగేందుకు మార్గం సుగమం అయింది.







మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: