వైట్ హౌస్ రేస్ లో ట్రంప్ వెనుకబడినట్టేనా..?

NAGARJUNA NAKKA
నిన్న ఉన్న పరిస్థితి ఇవాళ లేదు. ట్రంప్ ఆశలు ఒక్కొక్కటిగా జారిపోతున్నాయి. వైట్‌హౌస్‌ రేస్‌లో ప్రస్తుత అధ్యక్షుడు వెనుకబడుతున్నారు. ఏదో ఒకటి చేసి గెలవాలని భావిస్తున్నా... పరిస్థితులు సానుకూలంగా కనిపించడం లేదు. నిన్నటి వరకూ ట్రంప్ మెజార్టీ ఉన్న రాష్ట్రాల్లో కౌంటింగ్ పూర్తయ్యే కొద్దీ.. బైడెన్ ముందుకొస్తున్నారు. 16 ఎలక్టోరల్ ఓట్లున్న జార్జియాలో కౌంటింగ్ మొదలైన తర్వాత ట్రంప్ ఆధిక్యమే కొనసాగింది. కౌంటింగ్  చివరి దశకు వచ్చే సరికి ఊహించని రీతిలో బైడెన్ మెజార్టీలోకి వచ్చారు. జార్జియాలో ట్రంప్ గెలవలేకపోతే.. ఆయన అధ్యక్ష పదవిపై ఆశలు వదిలేసుకోవాల్సిందే.
వాస్తవానికి జార్జియా రిపబ్లికన్లకు పట్టున్న రాష్ట్రం. జార్జియాలో 95శాతం ఓట్ల లెక్కింపు పూర్తి అయింది. బైడెన్‌ 917 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బైడెన్‌ గెలిస్తే 16 ఎలక్టోరల్‌ ఓట్లు ఆయన ఖాతాలో పడతాయి. జార్జియాలో ఓడిపోయి మిగతా నాలుగింటిలో గెలిచినా ట్రంప్‌ మ్యాజిక్‌ ఫిగర్‌ను అందుకోలేరు. 2016లోనూ ట్రంప్‌.. అప్పటి డెమొక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై కేవలం 5శాతం ఓట్ల తేడాతో విజయం సాధించారు. జార్జియాలో రీకౌంటింగ్‌ దిశగా వెళ్లే అవకాశాలు కన్పిస్తున్నాయి. నిబంధనల ప్రకారం.. గెలుపు మార్జిన్‌ 0.5శాతం, అంతకంటే తక్కువ ఉన్నప్పుడు ఓడిపోయిన అభ్యర్థి రీకౌంటింగ్‌ కోరే అవకాశం ఉంటుంది. అయితే ఫలితాలు వెలువడిన రెండు రోజుల్లోపే సదరు అభ్యర్థి రీకౌంటింగ్ కోసం అడగాలి.  తాజా ఫలితాల్లో ట్రంప్ ఓడిపోతే ఆయనకు రీకౌంటింగ్‌ కోరే హక్కు ఉంటుంది.
జార్జియాలో బైడెన్‌ గెలిస్తే సెనెట్‌లో డెమొక్రాట్ల బలం పెరుగుతుంది. అప్పుడు చట్టాలు ఆమోదించడానికి, కీలక నియామకాలు చేపట్టడానికి డెమొక్రాటిక్‌ పార్టీకి ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఒకవేళ జార్జియాలో ఓడిపోయి.. బైడెన్‌ అధ్యక్షుడైతే మాత్రం సెనెట్‌లో ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఫలితం తేలని మిగతా నాలుగు రాష్ట్రాల్లో నెవడా, పెన్సిల్వేనియాలోనూ బైడెన్ ఆధిక్యంలో ఉన్నారు. పెన్సిల్వేనియాలో మెజార్టీ ఇద్దరితోనూ దోబూచులాడుతోంది. అలస్కా, నార్త్‌ కరోలినాలో ట్రంప్ ముందంజలో ఉండగా.. నెవడాలో మాత్రం బైడెన్‌ దూసుకెళ్తున్నారు. జార్జియా, నెవాడా డెమొక్రాట్ల వశమైతే అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ గెలుపు ఖాయమైనట్లే.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: