టిడిపి అధినేత చంద్రబాబు చాలా ఖుషి గా కనిపిస్తున్నారు. మొన్నటి వరకు కనిపించిన భయాందోళనలు ఇప్పుడు కనిపించకపోగా, సరికొత్త ఉత్సాహంతో ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. దీనికి కారణం వైసీపీ నే అనేది రాజకీయ వర్గాల్లో నడుస్తున్న టాక్. ఎందుకంటే మొన్నటివరకు టీడీపీకి చెందిన కీలక నాయకులతో పాటు, ఎమ్మెల్యేలు వైసిపి బాట పట్టడం, మరికొంతమంది వైసీపీలోకి వెళ్లేందుకు సిద్దమవుతుండటంతో ఈ మేరకు పార్టీని ధిక్కరిస్తూ, పార్టీకి చేటు తెచ్చే విధంగా వ్యవహరించడం వంటి ఎన్నో వ్యవహారాలు నడిచాయి. దీంతో ఎప్పుడు ఎవరు పార్టీని వీడి బయటకు వెళ్ళిపోతారో అనే భయం టీడీపీలో ఎక్కువగా కనిపించేది. అసలు బాబు ఈ స్థాయిలో భయపడడానికి కారణం లేకపోలేదు.
ఇప్పటికే వల్లభనేని వంశీ, మద్దాల గిరి, కరణం బలరాం , వాసుపల్లి గణేష్ వంటి వారు టీడీపీకి దూరమయ్యారు. మరికొంతమంది వీరు కాకుండా మరో ఇద్దరు , ముగ్గురు ఎమ్మెల్యేలు బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారనే వార్తలు బయటకు వస్తున్నాయి. వారు గనుక పార్టీని వీడి బయటకు వెళ్ళిపోతే, తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రధాన ప్రతిపక్ష హోదా రద్దవుతుంది. మొత్తం అసెంబ్లీ సీట్లలో 10 శాతం కంటే తక్కువగా ఉంటే, ప్రధాన ప్రతిపక్ష హోదా రద్దు అవుతుంది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ 175 స్థానాలు ఉండగా టిడిపికి 23 జనసేనకు 1, వైఎస్ఆర్ కాంగ్రెస్ 151 స్థానాలు దక్కాయి. టీడీపీకి ఇప్పటికీ నలుగురు శాసనసభ్యులు దూరమవడంతో మరో ఇద్దరు కనుక పార్టీకి దూరం అయితే ప్రధాన ప్రతిపక్ష హోదా రద్దు అయిపోతుంది. ఇదే బాబుని కలవరానికి గురిచేస్తోంది.
మొన్నటి వరకు విశాఖ టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ప్రకాశం జిల్లాకు చెందిన గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, గుంటూరు జిల్లాకు చెందిన అనగాని సత్యప్రసాద్, తూర్పుగోదావరి చెందిన జోగేశ్వరరావు వంటివారు వైసీపీ లోకి వెళ్ళిపోతారు అని బాబు భయపడ్డారు. అయితే ప్రస్తుతం ఏపీ లో రాజకీయ సమీకరణాలు మారిపోవడంతో పాటు, వైసీపీ ప్రభుత్వం కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న తరుణంలో, ఆ పార్టీ వైపు వెళ్లేందుకు టిడిపికి చెందిన ఎమ్మెల్యేలు వెనకడుగు వేస్తుండటం, ఇప్పటికిప్పుడు టీడీపీని వీడి వైసీపీలో కి వెళ్ళిన్నా, పెద్దగా కలిసొచ్చే అంశాలు లేకపోవడం , ఇవన్నీ లెక్కలు వేసుకుంటూ వారు వెనుకడుగు వేస్తుండడంతో బాబు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారట.