V6 ఛానల్ ఓనర్, బీజేపీ లీడర్ వివేక్ బుక్ అయ్యాడా? బుక్ చేశారా..?

Chakravarthi Kalyan
వీ6 ఛానల్, వెలుగు పత్రిక.. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ కు వ్యతిరేకంగా గళం విప్పుతున్న మీడియా ఏదైనా ఉందంటే అది ఈ వీ6, వెలుగు మాత్రమే అని చెప్పొచ్చు. కొన్నాళ్ల క్రితం వరకూ టీఆర్ఎస్‌లోనే ఉన్న ఈ మీడియా అధినేత వివేక్ కొంత కాలం క్రితం బీజేపీలో చేరడంతో ఇప్పుడు ఈ వీ6, వెలుగు రెండూ తెలంగాణ ప్రభుత్వ తప్పులను ఎండగడుతున్న సంగతి తెలిసిందే. ఇక దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో ఈ మీడియా మరింత స్వరం పెంచింది.
పరిస్థితి ఇలా ఉంటే.. దుబ్బాక ఎన్నికల్లో డబ్బు పంచేందుకు సిద్దం చేసిన కోటి రూపాయల నగదు హైదరాబాద్ లో దొరికిందన్న వార్తలు సంచలనం సృష్టించాయి. అందులోనూ ఈ డబ్బు తాము విశాక ఇండస్ట్రీస్ యజమాని నుంచి తీసుకెళ్తున్నామని నిందితులు చెప్పినట్టు పోలీసులు తెలిపారు. విశాక ఇండస్ట్రీస్ అంటే.. అది వీ6, వెలుగు మీడియా అధిపతి వివేక్‌ దే. ఏకంగా సీపీ అంజన్ కుమార్ వివేక్ పేరు కూడా చెప్పేశారు. అంటే ఇప్పుడు తెలంగాణ సర్కారు వివేక్ ను టార్గెట్ చేసిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే తనను ఉద్దేశపూర్వకంగానే ఈ కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతోందని వివేక్ అంటున్నారు. తనకు సంబంధం లేని ఒక బిజినెస్ లావాదేవీల వ్యవహారంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తన పేరును లాగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ ఆయన ఓ ప్రకటన చేశారు.  దుబ్బాకలో టీఆర్ఎస్ దారుణంగా ఓడిపోతోందని, బీజేపీ గెలవబోతుందనే విషయాన్ని కేసీఆర్ గ్రహించారని... అందుకే బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వివేక్ అంటున్నారు.
తనపైపైనా వ్యక్తిగతంగా కుట్రలు చేస్తున్నారని.. ఈ విషయంలో పోలీసులపై ఒత్తిడి తెచ్చిన సీఎం కేసీఆర్ పై పరువు నష్టం దావా వేసేందుకు న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నానని వివేక్ ఆ ప్రకటనలో తెలిపారు. దుబ్బాక ఎన్నికల కోసం పోలీసులను వాడుకుని అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినప్పటికీ... బీజేపీ గెలుపు ఖాయమంటున్న వివేక్.. దుబ్బాక ప్రజలు కేసీఆర్ తుగ్లక్ పాలన పట్ల విసుగు చెంది వారు తప్పకుండా బీజేపీని గెలిపించబోతున్నారన్నారు.
నిజంగా దుబ్బాకలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలంటే, దమ్ముంటే కేసీఆర్ ఫామ్ హౌస్ పై, ప్రగతి భవన్ పై పోలీసులు రెయిడ్ చేయాలని వివేక్ డిమాండ్ చేస్తున్నారు. ఓటర్లకు పంచేందుకు డబ్బులన్నీ టీఆర్ఎస్ పార్టీ అక్కడ నుంచే పంపిస్తోందన్నది బహిరంగ రహస్యమని వివేక్ ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: