కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన..!

NAGARJUNA NAKKA
దాదాపు పదిరోజులుగా హైదరాబాద్‌ ప్రజలను వెంటాడుతున్న వరుణుడు కాస్త శాంతిస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ఈ రోజు, రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అటు కోస్తాంధ్రలో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో  అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ అల్పపీడనం ప్రభావం సంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, యాదాద్రి, ఖమ్మం ప్రాంతాల్లో అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న 24 గంటల్లో తెలంగాణలో వర్షపాతం తగ్గనుందని, ఆ తర్వాత రేపు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే  అవకాశం ఉంది. అల్పపీడనం దిశను మార్చుకున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరంవైపు మళ్లినట్లు వివరించింది.  పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌ సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో నేడు, రేపు కోస్తా ఆంధ్రలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో భారీగా వాన కురిసే అవకాశం ఉంది.  కాగా గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే సూచనలు ఉన్నందున, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ అయ్యాయి.
మొత్తానికి వాతావరణ శాఖ హెచ్చరికలు తెలుగు రాష్ట్రాలను బెంబేలెత్తిస్తున్నాయి. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన ఉండటంతో అక్కడి వారు గజగజా వణికిపోతున్నారు. తమ పంటల పరిస్థితి ఏమవుతుందోనని టెన్షన్ పడిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: