నువ్వా.. నేనా.. అనేలా ఇద్దరి మధ్య డిబేట్..!

NAGARJUNA NAKKA
అమెరికా అధ్యక్ష ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్‌ ట్రంప్‌, బైడెన్‌ మధ్య చర్చ జరగనుంది. తొలి చర్చలో వ్యక్తిగత దూషణలకు దిగిన అభ్యర్థులు.. రెండో చర్చలు ఏయే అంశాలను లేవనెత్తుతారనే ఆసక్తి నెలకొంది. అయితే ఈ చర్చను చాలా హుందాగా నిర్వహించాలని నిర్ణయించింది పర్యవేక్షణ కమిషన్‌. దీనిలో భాగంగా నిబంధనల్లో పలు మార్పులు చేసింది. అభ్యర్థుల్లో ఎవరైనా నోరు జారితే వాళ్ల మైక్‌ను కట్‌ చేయనుంది కమిషన్‌.
నువ్వో మొద్దు, నోరు మూసుకో, చదువులో మొద్దు అబద్దాలు చెప్తావు.. నువ్వో జోకర్‌వి అంటూ డొనాల్డ్‌ ట్రంప్‌ రెచ్చిపోతే.. నువ్వో  జాత్యహంకారివి.. అధ్యక్ష పదవికి పనికిరావు, నువ్వో లోఫర్‌వి.. పుతిన్ చేతిలో కుక్క పిల్లవంటూ మాటల దాడి చేశారు జో బైడెన్‌. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌... డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్ల మధ్య జరిగిన తొలి చర్చ తీరిది.
అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడే అభ్యర్థుల మధ్య మూడు బహిరంగ చర్చలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగా సెప్టెంబరు 29న ట్రంప్‌, బైడెన్‌ల మధ్య తొలి సంవాదం జరిగింది. అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తుల ఎంపికలో వచ్చిన ఆరోపణలు,  విమర్శలపై మొదటి ప్రశ్నతో ముఖాముఖి ప్రారంభమైంది. బైడెన్‌ వ్యాఖ్యలను ట్రంప్‌ ఖండిస్తూ.. గత ఎన్నికల్లో తాము గెలిచాం కనుక సుప్రీం కోర్టు నియామకాల్లో తమ  ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందన్నారు. తనను మూడేళ్ల  కోసం ఎన్నుకోలేదని ధీటుగా సమాధానం ఇచ్చారు ట్రంప్‌.
తొలి డిబేట్‌లో ఒబామా కేర్ పాలసీని నాశనం చేశారంటూ ట్రంప్‌పై మండిపడ్డారు బైడెన్‌. దానిని రద్దు చేయడం వల్ల జనం ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. అయితే, తమ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తోందని తెలిపారు ట్రంప్‌. మందుల ధరలు గణనీయంగా తగ్గాయని గుర్తు చేశారు. కరోనా వైరస్‌ విషయంలో ప్రజల్ని అప్రమత్తం చేయడంలో విఫలమయ్యారని ట్రంప్‌ను విమర్శించారు బైడెన్‌. వైరస్‌ వ్యాప్తిని నియంత్రించలేకపోయారని, వైద్య, ఆరోగ్య విధానంపై ట్రంప్‌కు సమగ్ర ప్రణాళిక లేదని విరుచుకుపడ్డారు. అయితే.. డెమొక్రటిక్ పార్టీ 47 ఏళ్ల పాలనలో అమెరికాకు చేసిందేమీ లేదంటూ కౌంటరిచ్చారు ట్రంప్. భారత్ సహా పలు దేశాల్లో కరోనాతో ఎంత మంది చనిపోయారో బైడెన్‌కు తెలియదా అంటూ ట్రంప్ సూటిగా  ప్రశ్నించారు. మీ హయాంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినిందని తొలి డిబేట్‌లో బైడెన్ ఆరోపిస్తే.. తమ పాలనలో ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధిస్తోందని చెప్పుకొచ్చారు ట్రంప్.  
తొలి డిబేట్‌ జరిగిన రెండు రోజులకే ట్రంప్‌ కరోనా బారినపడ్డారు. దీంతో రెండో డిబేట్‌ను వర్చువల్‌గా నిర్వహించాలని భావించారు. అయితే, దీనికి ట్రంప్‌ విముఖత వ్యక్తం చేశారు. దీంతో రెండో చర్చ రద్దయ్యింది. ఇక మూడో చర్చలో నేతలిద్దరూ పరుష పదజాలంతో ఒకరినొకరు దూషించుకోకుండా చర్యలు నిబంధనల్లో మార్పులు చేసింది కమిషన్‌. ఒకరి ప్రసంగానికి మరొకరు అడ్డుపడకుండా మైక్‌ను కట్‌ చేయాలని కమిషన్‌ నిర్ణయించింది. ఈ మేరకు మ్యూట్‌ బటన్‌ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. దీని వల్ల అభ్యర్థులు ఒకరు మాట్లాడేటప్పుడు మరొకరు జోక్యం చేసుకోకుండా ఇది ఉపయోగపడుతుంది. అయితే కమిషన్ నిర్ణయంపై ట్రంప్ బృందం అభ్యంతరం వ్యక్తం చేసింది. కమిషన్‌ మొదటి నుంచి పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది. బైడెన్‌కు లబ్ధి చేకూర్చేందుకే ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించిన ట్రంప్‌ టీమ్‌. కానీ.. తాము చర్చలో పాల్గొంటామని స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: