జగత్ కిలాడీలు.. జగన్ ముఖ్య సలహాదారు పేరు ఇలా వాడేస్తున్నారా..?
ప్రజల్లో అధికారంలో ఉన్నవారంటే ఉన్న భయభక్తులే పెట్టుబడిగా కొందరు మోసగాళ్లు తయారయ్యారు. వారు అధికారంలో ఉన్నవారికి సన్నిహితంగా ఉండేవారి పేరు ఉపయోగించుకుని మోసాలకు పాల్పడుతున్నారు. నాకు ఆయన చాలా క్లోజ్.. ఆయన చెబితే పని ఇట్టే అయిపోతుంది.. నీకు నేను పని చేసిపెడతాగా.. ఆ ఉద్యోగం నీకే ఇప్పిస్తాగా.. అంటూ మాయమాటలు చెప్పి అమాయక జనం దగ్గర డబ్బు వసూలు చేస్తుంటారు.
ఇప్పుడు ఏపీ సీఎం ప్రధాన సలహాదారు, మాజీ సీఎస్ అజేయ కల్లం కూడా ఇదే బాధపడుతున్నారు. ఆయన పేరు చెప్పుకుని.. మంగళగిరికి చెందిన కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఘరానా మోసాలకు పాల్పడుతున్నారట. ఈ విషయం తెలుసుకున్న అజేయ కల్లం ఏకంగా డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ ముఠా తన పేరును వాడుకుని జూనియర్ లైన్‌మెన్, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు చేశారు.
ఇటీవలే ఈ వాట్సప్ పోస్టుల ద్వారా ఈ విషయం తన దృష్టికి వచ్చిందని.. ఈ ముఠా సంగతేంటో తేల్చాలని ఆయన డీజీపీని కోరారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని అజేయ కల్లం తన ఫిర్యాదులో డీజీపీని కోరారు. ఒకవేళ విచారణలో ఈ వార్తలు తప్పని తేలితే వాట్సప్ మేసేజ్‌లు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి, వాటికి కారకులేవరో గుర్తించి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా అజేయ కల్లం విజ్ఞప్తి చేశారు. ఇలా ఉంటాయ్ కొందరు బద్మాష్ గాళ్ల లత్కోరు పనులు.