మేం ప్రేమికులం.. ప్రేమే మా కులం.. అమృతతో కలసి పోరాడతానంటున్న అవంతి..?

Chakravarthi Kalyan
అమృతా ప్రణయ్, అవంతి హేమంత్.. పెద్ద వాళ్లు కులాభిమానానికి భర్తలను పోగొట్టుకున్న  ప్రేమ పక్షులు.. ప్రేమలో కష్టనష్టాలుంటాయని తెలిసీ.. ప్రేమే దైవంగా ధైర్యంగా ముందడుగు వేసిన ఈ తరం అమ్మాయిలు.. కానీ పాత తరం తల్లిదండ్రులు వాళ్ల ప్రేమని ఆశీర్వదించలేదు.. ఆ ప్రేమలో స్వచ్చత ఎంతని పరీక్షించలేదు.. కర్కశంగా కాటు వేశారు. తమ కూతుళ్లను తమకు దక్కనీయలేదన్న కోపంతో వారి భర్తలను దారుణంగా చంపేశారు. అమృత, అవంతి.. ఇలా ఇంకా ఎంతమంది ఆడపిల్లల జీవితాలు పరువుకు బలవ్వాలి ?

అందుకే ఇప్పుడు ఈ పరువు హత్యలకు వ్యతిరేకంగా చట్టాలు వచ్చే వరకూ తాను అమృతా ప్రణయ్ తో కలిసి పోరాడుతా అంటోంది అవంతి హేమంత్. కులం మనుషులు పెట్టిందేనని... జీవితం దేవుడు ఇచ్చిందంటున్నారు. తన భర్త దారుణ హత్య ఘటన తర్వాత అమృత తనతో ఫోన్‌లో మాట్లాడిందంటున్న అవంతి హేమంత్...  పరువు హత్యలను నిరోధించే ప్రత్యేక చట్టం కోసం అమృతతో పాటు మాలాంటి బాధితురాళ్లతో కలిసి ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నానంటోంది.

గతంలో తాను  పెళ్లిచేసుకున్న సంగతి రెండు, మూడు వేల మందికే తెలిసిందని... అదే తన  తల్లితండ్రులు చేసిన పని గురించి ఇప్పుడే దేశమంతా మాట్లాడుకుంటోందని అవంతి అంటున్నారు.  జీవితభాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ నాకు లేదా? ప్రేమ వివాహం చేసుకోవడం నేరమెలా అవుతుంది? పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకొని, విడాకులు తీసుకున్న జంటలు లేరా? అంటూ తన తల్లిదండ్రులను, ఈ సమాజాన్ని  ప్రశ్నిస్తోంది. తాను తీసుకున్న నిర్ణయం తప్పు కాదని తనకు తెలుసని.. ఎన్ని కోట్లు కట్నంగా ఇచ్చినా, హేమంత్‌లాంటి మంచి వ్యక్తిని తనకు భర్తగా మా డాడీ తీసుకురాలేడని ఆమె నమ్మకంగా చెబుతోంది.

హేమంత్‌తో ఒకసారి మాట్లాడండాలని.. తమను తాము నిరూపించుకొనే అవకాశం ఇవ్వాలని ఎంతగానో తల్లిదండ్రులను బతిమాలినా వారి మనసు కరగలేదని అవంతి కన్నీళ్లు పెట్టుకుంటోంది.  తన అమ్మానాన్నా కొన్నాళ్ల తరువాతైనా మారతారనుకొన్నానని..  మా పాటికి మమ్మల్ని బతకనిస్తారనుకున్నానంటున్న అవంది.. ఏకంగా నా హేమంత్‌నే మింగేస్తారనని అనుకోలేదని కన్నీటితో హేమంత్‌ను గుర్తు చేసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: