మిస్సైల్‌ పరీక్షల్లో భారత్ మరో మైలురాయి !

NAGARJUNA NAKKA
మిస్సైల్‌ పరీక్షల్లో భారత్ మరో మైలురాయి దాటింది. యాంటీ రేడియేషన్ క్షిపణి రుద్రం-1ను విజయవంతంగా ప్రయోగించింది. బాలాసోర్ నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి.. నిర్ధేశిత లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించినట్లు రక్షణరంగ అధికారులు తెలిపారు. మరోవైపు రుద్రం-1 సక్సెస్‌ కావడంలో కీలకపాత్ర పోషించిన శాస్త్రవేత్తలను రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ప్రశంసించారు.

శత్రుదేశాల నుంచి వచ్చే ముప్పును ధీటుగా ఎదుర్కొనేందుకు భారత్ అన్ని విధాల సన్నద్ధమవుతోంది. దేశ రక్షణ రంగంలో అత్యాధునిక ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది. దీనిలో భాగంగా వాయుసేన అమ్ముల పొదిలోని తిరుగులేని అస్త్రాన్ని పరీక్షించింది. శత్రు దేశాల రాడార్లు, నిఘా వ్యవస్థలను మట్టి కరిపించేలా డీఆర్డీఓ అభివృద్ధి చేసిన రుద్రం -1  క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్‌లో సుఖోయ్‌-30 యుద్ధ విమానం నుంచి ప్రయోగించిన ఈ మిసైల్‌ నిర్దేశిత లక్ష్యాలను ఛేదించినట్లు డీఆర్‌డీఓ ప్రకటించింది.

రుద్రం-1.. ప్రధానంగా యాంటీ రేడియేషన్ క్షిపణి.. దీన్ని కనిష్టంగా 5 వందల మీటర్లు, గరిష్టంగా 15 కిలోమీటర్ల ఎత్తు నుంచి ప్రయోగించవచ్చు. ఈ యాంటీ రేడియేషన్ క్షిపణి.. ఆల్టిట్యూడ్‌ ను బట్టి వంద నుంచి రెండువందల కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను చేధిస్తుంది. శత్రు రాడార్లు, ట్రాకింగ్‌, కమ్యూనికేషన్‌ వ్యవస్థలకు నాశనం చేసేందుకు దీనిని అభివృద్ధి చేశారు. ఈ క్షిపణి ప్రయోగంతో భారత వాయుదళం మరింత బలోపేతమైందని అధికారులు తెలిపారు. మరోవైపు..క్షిపణి ప్రయోగం విజయవంతమవడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్‌డీవో శాస్త్రవేత్తలకు అభినందనలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

భారత్‌-చైనా మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలున్న తరుణంలో.. భారత్‌ వరుస క్షిపణి ప్రయోగాలను నిర్వహిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవలే నాలుగు క్షిపణులను పరీక్షించిన భారత్‌.. నిర్భయ మిసైల్‌ను భారత్‌-చైనా సరిహద్దులకు కూడా తరలించింది. మొత్తానికి  సుఖోయ్ యుద్ధ విమానం నుంచి ప్రయోగించిన యాంటిరేడియేషన్ మిస్సైల్ రుద్రం-1 ప్రయోగం విజయవంతమైంది.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: