ఆంధ్రజ్యోతిది తప్పుడు కథనమంటూ ఏపీ సర్కారు వాదన..!
హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ఏపీ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనంపై విచారణ సందర్భంగా హైకోర్టులో ఆసక్తికరమైన వాదనలు చోటు చేసుకున్నాయి. అసలు ఇది పూర్తిగా తప్పుడు కథనం అని ఏపీ సర్కారు వాదించింది. నిరాధార, తప్పుడు కథనాన్ని ఆధారంగా చేసుకుని దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ప్రాథమిక దశలోనే కొట్టేయాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును అభ్యర్థించింది. ఈ వార్తా కథనం ప్రామాణికతను తెలుసుకోకుండా ప్రభుత్వంపై నిరాధారణ ఆరోపణలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలు చేయడం సరికాదని తెలిపింది.
ఇలాంటి ఓ తప్పుడు వార్త ద్వారా పిటిషనర్ న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేశారని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. అంతే కాదు.. తప్పుడు కథనం ప్రచురించిన ఆ పత్రికకు ఇప్పటికే లీగల్ నోటీసు జారీ చేశామని, ఆ తదుపరి చర్యలు కూడా ఉంటాయని ఏపీ ప్రభుత్వం వివరించింది. అసలు ప్రామాణికత లేని వార్తల ఆధారంగా పిల్ దాఖలు చేయడానికి కుదరదంటూ ఇందుకు పాత సుప్రీంకోర్టు తీర్పులను ఉదహరించింది.
గతంలో కుసుమలత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఈ విషయంపై చాలా స్పష్టంగా చెప్పిందని ఏపీ సర్కారు గుర్తు చేసింది. ఆంధ్రజ్యోతి ప్రచురించిన తప్పుడు కథనం ఆధారంగా విశాఖపట్నంకు చెందిన న్యాయవాది నిమ్మిగ్రేస్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.