ఆ నగరంలో మాస్కు ధరించకపోతే ప్రయాణాలకు ఆటంకాలు తప్పవు!
బిఎంసి కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ నేతృత్వంలో జరిగిన డిజిటల్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. టాక్సీ, ఆటోరిక్షా యూనియన్ల తో పాటు ఇతర ప్రజా రవాణా సంస్థల నిర్వాహకులకు ఈ నిబంధన అమలులోకి వస్తుందని తెలియజేసినట్టు అధికారులు వెల్లడించారు.
మాస్క్ ధరించకుండా కరోనా నిబంధనను ఉల్లంఘిస్తే ఇక్బాల్ సింగ్ చాహల్ ఆదేశాల ప్రకారం ప్రజలు 200 రూపాయల జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 26 మధ్యకాలంలో ముంబైలో మాస్కులు ధరించకుండా రోడ్లమీద తిరిగి అందుకుగాను బిఎంసి అధికారులు దాదాపు 14 వేల మందికి జరిమానా విధించారు. అయితే ఇప్పటివరకు నిబంధనలను ఉల్లంఘించిన వారి నుండి సుమారు రూ .52.76 లక్షలను వసూలు చేశామని అధికారులు వెల్లడించారు.
మెట్రోపాలిటన్ బస్సులలో ప్రయాణించే ప్రయాణికులపై ఈ నిబంధన కఠినంగా అమలు చేయాలని సురేంద్ర కుమార్ అనే ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. ఇకపోతే ముంబై నగరంలో ఇప్పటికే రెండు లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8800 మంది కరోనా పీడితులు మృతి చెందారు. మంగళవారం నాడు 1, 713 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 49 మంది కరోనా తో మరణించారు. ప్రస్తుతం ముంబై మహానగరంలో ఇప్పటివరకు కరోనా తో చనిపోయిన వారి సంఖ్య 8, 880 కు చేరుకుంది. మంగళవారం రోజు మహారాష్ట్రలో 14 వేల కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ మంత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.