17 ఏళ్ల కుర్రాడిని అత్యంత కిరాతకంగా చంపిన ఓ దుండగుడు..
పూర్తి వివరాలు తెలుసుకుంటే.. హత్యకు గురైన బాలుడు అర్మాన్ యొక్క బంధువైన జస్బీర్ పోలీసులతో మాట్లాడుతూ అర్మాన్ 12 వ తరగతి చదువుతున్నాడని చెప్పింది. మృతుడి తండ్రి దేవేంద్ర కుమార్ విదేశాలలో పని చేస్తారని... తల్లి, సోదరి హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నారని ఆమె తెలిపింది. ఐతే మృతి చెందిన అర్మాన్ ఇంటికి సమీపంలోనే జస్బీర్ నివసిస్తుంది. సంఘటన జరిగిన రోజు జస్బీర్ బజార్‌కు వెళుతుండగా ఇంటిని లోపలి నుంచి లాక్ చేయమని అర్మాన్ కోరాడు. ఐతే ఆమె తిరిగి వచ్చినప్పుడు, గేట్ తెరిచి ఉంది. అదే సమయంలో అక్కడే ఆడుకుంటున్న అర్మాన్ స్నేహితులు అతనిని బయటకు పిలిచారు. కానీ అతని స్నేహితులు ఎంత పిలిచినా అర్మాన్ మాత్రం బయటికి రాలేదు. దాంతో జస్బీర్ ఇంటి లోపలికి వెళ్లి చూడగా అర్మాన్ రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన ఆమె గట్టిగా అరవడంతో స్థానికులు వెంటనే సంఘటన స్థలంలో గుమికూడారు. తదనంతరం అతన్ని స్థానిక ఎస్‌జీఎల్ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అర్మాన్ చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు.
ఈ హత్య గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అర్మాన్‌ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తి హత్య చేశాడని స్థానిక ప్రజలు చెప్పారు. దాంతో సంఘటనా స్థలంలో వేలిముద్రలను సేకరించి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. త్వరలోనే హంతకుడిని పట్టుకుంటామని పోలీసులు మీడియాకి వెల్లడించారు.