ఖరీదైన గూడ్స్ అక్రమ రవాణా.. కాస్ట్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే.!

Suma Kallamadi
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో లగ్జరీ గడియారాల అక్రమ రవాణా గుట్టు రట్టయింది. కస్టమ్స్ విభాగం చాలా చాకచక్యంతో వ్యవహరించడంతో ఖరీదైన వాచీలను రవాణా చేస్తున్న పలువురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి నుండి రూ.2.89 కోట్ల విలువ చేసే 33 గడియారాలను సీజ్ చేసారు. దేశ రాజధానిలోని అతి పెద్ద షోరూమ్‌లు ఎటువంటి దిగుమతి సుంకం చెల్లించకుండా ఈ గడియారాలను దిగుమతి చేస్తున్నట్లు సమాచారం..
దీనికి వారు భారీ కమీషన్ ఇవ్వడంతో, పలువురు ఈ అక్రమ రవాణాకు పూనుకున్నట్లు తెలుస్తోంది. విదేశాల నుంచి ఖరీదైన గడియారాల అక్రమ రవాణా సాగుతుందనే విషయం గ్రహించిన కస్టమ్స్ విభాగం అధికారులు తనిఖీలు ముమ్మరం చేయగా.. ఈ సంఘటన వెలుగు చూసింది. ఈ క్రమంలోనే నెల 24న ఇందిరాగాందీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్‌ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తుల నుండి రూ.51.55 లక్షల విలువ చేసే 4 గడియారాలను సీజ్ చేసిన సంగతి విదితమే.
అయితే, గతంలో కూడా వీరు పలు మార్లు రూ.1.40 కోట్ల విలువైన గడియారాలను అక్రమంగా రవాణా చేసినట్లు విచారణలో అంగీకరించారు. వీరిచ్చిన సమాచారం మేరకు కస్టమ్స్‌ అధికారులు.. విదేశీ బ్రాండెడ్‌ వాచెస్ విక్రయించే ఒక షాపుపైన దాడి చేసి 33 హై ఎండ్‌ గడియారాలను పట్టుకోవడం గమనార్హం. వీటి విలువ దాదాపుగా రూ.2.89 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.
ఇకపోతే, కొన్ని కంపెనీలను రన్ చేసేవారే ఈ ఖరీదైన విదేశీ గడియారాలను చట్ట విరుద్ధంగా దిగుమతి చేసుకుంటున్నట్టుగా దర్యాప్తులో భాగంగా తేలింది. ఇద్దరు ప్రయాణికుల నుండి రూ.2.5 కోట్ల విలువైన గడియారాలను వీరు కొనుగోలు చేసినట్లు కస్టమ్స్ అధికారుల విచారణలో అంగీకరించారు. ఒక్కో వాచీ విలువ సుమారు రూ.10 లక్షల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కాగా.. ఇటీవల కొంత కాలంగా కస్టమ్స్ అధికారులు అక్రమ గూడ్స్ రవాణా పైన కొరడా ఝళిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: