డ్వాక్రా మహిళలకు జగన్ గుడ్ న్యూస్... సెప్టెంబర్ 11న వైఎస్సార్ ఆసరా...?

Reddy P Rajasekhar
ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. తాజాగా మరో పథకం రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. వైయస్సార్ ఆసరా పథకం ద్వారా పొదుపు మహిళలకు లబ్ధి చేకూర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తాజాగా ప్రభుత్వం వైయస్సార్ ఆసరా పథకానికి సంబంధించిన విధివిధానాలను విడుదల చేసింది. ప్రభుత్వం ఈ పథకం కింద ఇచ్చే డబ్బులను బ్యాంకులు వ్యక్తిగత అంగీకారం లేకుండా జమ చేసుకోకూడదని పేర్కొంది.
 
వైయస్సార్ ఆసరా కింద ఇచ్చే నగదును మహిళలు ఏ అవసరాల కోసమైనా వినియోగించుకోవచ్చని పేర్కొంది. ఈ నగదుపై ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించడం లేదని తెలిపింది. గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది నుంచి ఈ మేరకు ఉత్తర్వులు విడుదలయ్యాయి. ప్రభుత్వం వైయస్సార్ ఆసరా పథకం నగదును పొదుపు సంఘాల ఖాతాల్లో జమ చేయనుంది. ఆ తర్వాత సంఘం మహిళల వ్యక్తిగత ఖాతాల్లో నగదు జమ చేయాల్సి ఉంటుంది.
 
ఈ పథకం కింద లబ్ధి పొందుతున్న వారికి సంబంధించిన జాబితాను ఈ నెల 25వ తేదీ నుంచి అన్ని గ్రామ, వార్డ్ సచివాలయాల్లో అందుబాటులో ఉంచనున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈవో ఈ విషయాలను వెల్లడించారు. అనంతరం సోషల్ ఆడిట్ నిర్వహించి అర్హుల జాబితాను మెప్మా, సెర్ఫ్ వెబ్ సైట్లలో అందుబాటులో ఉంచుతారు. అర్హత ఉండి పథకానికి ఎంపిక కాకపోతే ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ద్వారా వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుంది.
 
2019 ఏప్రిల్ నెల 11వ తేదీ వరకు డ్వాక్రా మహిళల పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును నాలుగు దఫాలుగా ఖాతాలలో జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా 9,33,180 పొదుపు సంఘాలకు ప్రయోజనం చేకూరనుందని తెలుస్తోంది. 27,168 కోట్ల రూపాయల రుణాలను ప్రభుత్వం రాబోయే నాలుగేళ్లలో చెల్లించనుంది. కరోనా కష్ట కాలంలో సైతం జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటంపై ప్రజలు సీఎంను ప్రశంసిస్తున్నారు.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: