దేశంలో తొలి బ్యాచ్ లో 50 లక్షల కరోనా వ్యాక్సిన్లు... మొదట ఇచ్చేది ఎవరికంటే...?

Reddy P Rajasekhar
దేశంలో కరోనా మహమ్మారి అడ్డూఅదుపు లేకుండా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో నమోదవుతున్న కేసులు ప్రజల్లో భయాందోళనను పెంచుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రోజురోజుకు కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ నియంత్రణ సాధ్యమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
ప్రస్తుతం దేశంలో మూడు వ్యాక్సిన్‌లు ప్రయోగ దశలో ఉండగా ఈ వ్యాక్సిన్లు సత్ఫలితాలు ఇస్తే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి నాలుగు నెలల సమయం పడుతుంది. ఏదైనా కరోనా వ్యాక్సిన్ సక్సెస్ అయితే కేంద్రం తొలి విడతగా 50 లక్షల డోసులను కొనుగోలు చేయాలని చూస్తోంది. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, ఆర్మీ, ఇతరులకు వ్యాక్సిన్ ను తొలుత కేంద్రం అందజేయనుంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత దాని సరఫరా, పంపిణీ విషయంలో కేంద్రం ప్రాధాన్యత చర్చనీయాంశమైంది.
 
కరోనా వారియర్స్ కు మొదట వ్యాక్సిన్ ను ఇవ్వాల్సి ఉన్నా వీలైనంత త్వరగా ఎక్కువ మంది సాధారణ జనాభాకు అందజేయాల్సి ఉంది. కేంద్రానికి వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేసే సంస్థలు 2020 చివరినాటికి లేదా వచ్చే ఏడాది ఆరంభంలో కొన్ని వారాల వ్యవధిలో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని హామీ ఇచ్చినట్టు తెలిపారు. నీతి-ఆయోగ్ సభ్యుడు వీకే పాల్, ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ నేతృత్వంలో కరోనా నిపుణుల బృందం నిన్న సమావేశమైంది.
 
టీకా తయారీ సంస్థలను వ్యాక్సిన్ తయారీ, ధరల శ్రేణులు, సలహాలు, సామర్థ్యాల గురించి నీతి ఆయోగ్ కోరింది. వ్యాక్సిన్ అభివృద్ధికి భారీగా ఖర్చు చేయాల్సి ఉండటంతో ప్రభుత్వం తప్పకుండా హామీ ఇచ్చే మార్కెట్‌ను సూచించాలని వ్యాక్సిన్ తయారీ కంపెనీకి చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. నిపుణుల కమిటీ వ్యాక్సిన్ కోసం నేషనల్ టెక్నికల్ అడ్వయిజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ సలహాలను కూడా కోరింది. పుణేలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వరంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ టీకా క్లినికల్ ట్రయల్స్ ఈ వారంలోనే ప్రారంభం కానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: