నిరుద్యోగులకు శుభవార్త... స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో 50,000 ఉద్యోగాలు...?

Reddy P Rajasekhar
దేశంలో కరోనా మహమ్మారి విలయం కొనసాగుతోంది. దేశంలో మార్చి నెలలో పదుల సంఖ్యలో కేసులు నమోదు కాగా గత కొన్ని రోజుల నుంచి 50,000కు పైగా కేసులు నమోదవుతున్నాయి. వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ వల్ల దేశంలోని చాలా రంగాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పలు రంగాలు కోలుకునే స్థితిలో లేవు. దేశంలో కోట్ల సంఖ్యలో ప్రైవేట్ సంస్థలలో పని చేసే ఉద్యోగులు కరోనా వల్ల నిరుద్యోగులయ్యారు.
 
ఉన్న కంపెనీలే ఉద్యోగులను తొలగిస్తున్న నేపథ్యంలో కొత్త కంపెనీలు ఉద్యోగ నియామక ప్రక్రియను చేపట్టటానికి ఆసక్తి చూపించడం లేదు. కరోనా విజృంభణ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చతికిలపడింది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటోంది. కేంద్రం చర్యల వల్ల వేలాది ఉద్యోగాలు ప్రజలకు అందుబాటులోకి రాబోతున్నాయి.
 
ఈ సంవత్సరం చివరినాటికి స్మార్ట్ ఫోన్ రంగంలో 50 వేల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి రావొచ్చని తెలుస్తోంది. దిగ్గజ కంపెనీలైన ఫాక్స్‌కాన్, విస్ట్రోన్, శాంసంగ్, డిక్సన్, లావా లాంటి దేశీ, అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు దేశంలో కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నాయి. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెన్‌టివ్ (పీఎల్‌ఐ) స్కీమ్ కింద కంపెనీలు యూనిట్లను ప్రారంభించనున్నాయి.
 
మోదీ సర్కార్ ఈ సంవత్సరం ఒకటో తేదీన మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్ కాంపొనెంట్స్ లలో ఇన్వెస్ట్‌మెంట్లను పెంచాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ ను అమలులోకి తీసుకొచ్చింది. ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పంకజ్ మహీంద్రో మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ‌లో 1100 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపారు. మొబైల్ ఫోన్లను మన దేశ అవసరాలకు మాత్రమే కాకుండా ఇతర దేశాల అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని మొబైల్ ఫోన్లను రూపొందించినట్లు తెలిపారు. ప్రత్యక్షంగా ఈ సంవత్సరం చివరినాటికి 50,000 మందికి ఉపాధి కలగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: