కరోనా వ్యాక్సిన్ విషయంలో భారత్ తొలి అడుగు... ఐదు ఫార్మా కంపెనీలతో సంప్రదింపులు...?

Reddy P Rajasekhar
దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది.దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 60,000కు అటూఇటుగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు వైరస్ తీవ్రత పెరుగుతోంది. మొదట్లో తక్కువ సంఖ్యలో కేసులు నమోదైన భారత్ లో లాక్ డౌన్ తరువాత భారీగా కేసులు నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తి చెందుతున్నా కరోనా రికవరీ రేటు కూడా అదే స్థాయిలో ఉండటం గమనార్హం. మరణాల సంఖ్య మాత్రం అంతకంతకూ పెరుగుతోంది.
 
కరోనా మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ల తయారీ ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే రష్యా వ్యాక్సిన్ విడుదల కాగా ఈ సంవత్సరం చివరినాటికి మరికొన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పలు వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ పూర్తైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టింది. కేంద్రం నుంచి ఇప్పటికే వ్యాక్సిన్ కు సంబంధించి తొలి అడుగు పడింది.
 
కేంద్రం కరోనా వ్యాక్సిన్లకు సంబంధించిన సమగ్ర నివేదికలను సమర్పించాలని ఐదు దేశీయ ఫార్మా కంపెనీలకు ఆహ్వానం పంపింది. నిన్న దేశ కరోనా వ్యాక్సిన్ గురించి చర్చించేందుకు నిపుణుల సమావేశం జరిగింది. కరోనా వ్యాక్సిన్ ను తయారు చేసేందుకు కావాల్సిన కనీస సమయం, ధర, ఇతర వివరాలను తెలపాలంటూ భారత్ బయోటెక్, జైడస్ క్యాడిలా, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, జెన్నోవా, బయోలాజికల్ ఈలను కేంద్రం కోరింది.
 
అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు కరోనా వ్యాక్సిన్ విజయవంతం అయిన తరువాత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ముందుగానే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. భారత్ ఇప్పటివరకు ఈ విధంగా ఏ సంస్థతోను ఒప్పందాలు కుదుర్చుకోలేదు. నేషనల్ టెక్నికల్ ఎడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్యూనైజేషన్ కు చెందిన స్టాండింగ్ టెక్నికల్ సబ్ కమిటీకి దేశీయంగా కరోనా వైరస్ వ్యాక్తిన్ తయారీదారును ఎంపిక చేసే అవకాశాన్ని కేంద్రం కల్పిస్తోంది. భారత్ వ్యాక్సిన్ కంపెనీలతో ఒప్పందాల దిశగా అడుగులు వేయడం ప్రజల్లో కరోనా ఆందోళనను కొంతవరకు తగ్గిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: