రాజకీయ నేతలను పట్టిపీడిస్తున్న కరోనా..!

NAGARJUNA NAKKA
కరోనా అందర్నీ ఒకేలా వాయిస్తోంది. చిన్నా పెద్దా, సామాన్యుడు, పొలిటీషయన్ తేడాలేదు.. ఏపీలో రోజు రోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో నేతల్లో కూడా కరోనా కేసులు అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఓ ఇద్దరు ప్రముఖ నేతలు కూడా కరోనా బారిన పడి మరణించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఏపీలో కరోనా వ్యాప్తి అంతకంతకు పెరుగుతోంది. రోజుకు తొమ్మిది వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి.. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే కరోనా పరీక్షల సంఖ్యతో పాటు, పాజిటివ్ కేసుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. రోజు వారీ పనుల మీద రోడ్డెక్కే సామాన్యులకే కాకుండా.. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్యన ఉండే నేతలకు కూడా కరోనా సోకుతోంది. ఏపీలో డిప్యూటీ సీఎంలు మొదలుకుని మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు ఇలా కరోనా బారిన పడిన వారి సంఖ్య పెద్దగానే ఉంది. ఎంత కంట్రోల్ లో ఉన్నా వివిధ సమస్యలతో తమను కలవడానికి వచ్చే సందర్శకులను, కార్యకర్తలను రావద్దని చెప్పలేని పరిస్థితిలో నేతలు కరోనా బారిన పడుతున్నారు.
కరోనా వైరస్ సోకిన నేతలు ఎక్కువగా గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఉన్నారు. గుంటూరు జిల్లాలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతితోపాటు.. మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య, తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శ్రీనివాస్, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా సోకింది. వీరు క్వారంటైన్లో ఉండి చికిత్స తీసుకుని కొలుకుని తిరిగి వచ్చారు. అలాగే కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన తొలి నాళ్లల్లోనే గుంటూరు సిటీకి చెందిన ఎమ్మెల్యే ముస్తాఫా సొదరుడికి కరోనా సోకడంతో.. ముందు జాగ్రత్త చర్యగా ఆయన కూడా క్వారంటైన్కు వెళ్లారు. ఈ జిల్లాలో కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ కూడా కరోనా బారిన పడడం చూస్తే.. జిల్లాలో కరోనా వైరస్ నేతలను అధికార గణాన్ని ఏ విధంగా వణికించిందో అర్థమవుతోంది.
ఇక ప్రకాశం జిల్లాలో కూడా నేతలు కరోనా బారిన పడి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కరోనా పాజిటీవ్గా నిర్ధారణ అయి చికిత్స తీసుకుంటున్నారు. అలాగే సీనియర్ ఎమ్మెల్యే.. ఇటీవలే వైసీపీలో చేరిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కూడా కరోనా చికిత్స తీసుకుంటున్నారు. కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్ కూడా కరోనా బారిన పడ్డారు. ఇక గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుతో పాటు, ఆయన భార్యకు కూడా కరోనా నిర్ధారణ అయింది.
ఈ జిల్లాల తర్వాత కరోనా వైరస్ ఎఫెక్ట్ నేతలకు ఎక్కువగా తగిలిన జిల్లా కర్నూలు అని చెప్పొచ్చు. ఈ జిల్లాలో శ్రీశైలం, నంద్యాల, కొడుమూరు ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవి కిశోర్ రెడ్డి, డాక్టర్ సుధాకర్లు కరోనా బారిన పడ్డారు. కర్నూలు జిల్లాలో మొదట్నుంచి కరోనా వైరస్ వ్యాప్తి అధికంగానే ఉంది. ఇక చిత్తూరు, కృష్ణా, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్యే కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి , విజయనగరం జిల్లా శృంగవరపు కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాస్, కృష్ణా జిల్లాలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కొంత కాలంగా సెల్ఫ్ క్వారంటైన్లోనే ఉంటున్నారు.
కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి పేర్ని నాని ఇటీవల కొన్ని రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లి.. తిరిగి విధుల్లో పాల్గొంటున్నారు. ఇక నెల్లూరు జిల్లా సూళ్లూరు పేట ఎమ్మెల్యే సంజీవయ్యకు కరోనా సోకింది. అపోలో ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుని కోలుకున్నారు. ఈ జిల్లాలో కొందరు నేతల వ్యక్తిగత సిబ్బందికి కరోనా సోకడంతో నేతలు కూడా క్వారంటైన్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతికి కరోనా సోకింది. విశాఖ అపొలోలో చికిత్స తీసుకుని కొలుకున్నారామె. కడప జిల్లాలో డెప్యూటీ సీఎం అంజాద్ భాషా కరోనా బారిన పడ్డారు.. హైదరాబాద్ లో చికిత్స తీసుకున్నారు.
ఇక అనంతపురం, ఉభయగోదావరి, విశాఖ వంటి జిల్లాల్లో మంత్రులు.. ఎమ్మెల్యేలు కరోనా బారిన పడలేదు. అయితే తూర్పు గోదావరి జిల్లాలో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కరోనా బారిన పడి మృత్యువాత పడగా.. పశ్చిమ గోదావరి జిల్లాలో మాజీ మంత్రి మాణిక్యాలరావు కూడా కరోనా వైరస్కు బలయ్యారు. అలాగే తూర్పు గోదావరి జిల్లాలోని ఒకరిద్దరు మాజీ ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. అనంతపురం జిల్లాలో నేతలు కరోనా బారిన పడకున్నా.. ఆ జిల్లాలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. మొదట్లో అనంత, ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లో పెద్దగా లేకున్నా.. ప్రస్తుత ఈ జిల్లాల్లోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్న పరిస్థితి ఉంది. దీంతో ఈ జిల్లాల్లో నేతలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. నేతల్లో ఎక్కువగా వ్యక్తిగత సిబ్బంది, గన్మెన్ల నుంచి వైరస్ సోకుతున్నట్టు సమాచారం. వీఐపీలకు సెక్యూరిటీ కల్పించే క్రమంలో గన్ మెన్లు.. వ్యక్తిగత సిబ్బంది ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవటం జరుగుతోంది. ఈ క్రమంలో సిబ్బందితోపాటు, నేతలు కూడా కరోనాబారిన పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: