కరెన్సీ నోట్లతో కరోనా సోకుతుందా..... నిజం ఏమిటంటే..?
భారతీయ రిజర్వ్ బ్యాంక్ కూడా మార్చి 16వ తేదీన ప్రజలు నగదు లావాదేవీల కంటే డిజిటల్ లావాదేవీలకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చింది. ప్రపంచంలోని పలు సెంట్రల్ బ్యాంకులు సైతం ఆయా దేశాల ప్రజలకు ఇలాంటి సూచనలే చేశాయి. మరి నోట్ల ద్వారా వైరస్ వ్యాపిస్తుందా...? అంటే కాదనే సమాధానం వినిపిస్తోంది. మన దేశంలో ప్రతిరోజూ కోట్ల రూపాయలు చేతులు మారుతూ ఉంటాయి.
నోట్ల ద్వారా వైరస్ వ్యాప్తి చెంది ఉంటే దేశంలో కోట్ల సంఖ్యలో కేసులు నమోదయ్యే పరిస్థితి ఉండేది. మన దేశంలోని లావాదేవీలలో 94 శాతం నగదు ద్వారానే జరుగుతుండటం గమనార్హం. నగదు లావాదేవీలు, జాతీయ స్థూల ఉత్పత్తి సంయుక్త నిష్పత్తితో పది లక్షల మందికి ఎంత మంది కరోనా రోగులు తేలుతున్నారనే సంఖ్యను పోల్చి చూస్తే నోట్లకు, కరోనాకు సంబంధం ఉందో లేదో సులభంగానే అర్థమవుతుంది.
స్వీడన్ లో కరెన్సీ లావాదేవీలు–జాతీయ స్థూల ఉత్పత్తి నిష్పత్తి 3.1 శాతం కాగా జులై నెల వరకు ఒక మిలియన్ కు 2,186 కేసులు నమోదయ్యాయి. భారత్ లో కరెన్సీ లావాదేవీలు–జీడీపీ రేషియో 11.2 శాతంగా ఉంది. అయితే మన దేశంలో మాత్రం జులై నెల మొదలయ్యే నాటికి ఒక మిలియన్ కు స్వీడన్ తో పోలిస్తే తక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. కరెన్సీ తక్కువగా, డిజిటల్ లావాదేవీలు ఎక్కువగా జరిగే అమెరికా, యూరో జోన్‌లో సైతం ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. అందువల్ల కరెన్సీతో కరోనా సోకదనే తెలుస్తోంది.