మీ కళ్లు అలా మారితే కరోనా కావచ్చు... పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్న వైద్యులు...?
తాజాగా శాస్త్రవేత్తలు కండ్లకలక లేదా పింక్ “ఐ”(లేత ఎరుపు రంగులో ఉన్న కళ్లు) కూడా కరోనా సంకేతమే అని చెబుతున్నారు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ యొక్క కరోనా లక్షణాల జాబితాలో పింక్ ఐ లేదు. కానీ ఈ లక్షణం కూడా కరోనానే కావచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లాంగోన్ హెల్త్ క్లినికల్ అసోసియేట్ ప్రొఫెసర్, నేత్ర వైద్యుడు లీలా వి. రాజు ఒకటి నుంచి 3 శాతం కరోనా కేసుల్లో కండ్ల కలక లేదా లేత గులాబీ రంగులో కళ్ల సమస్య ఉంటుందని తెలిపారు.
సాధారణంగా కరోనా రోగులు జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలతో పాటు కండరాల నొప్పి, తలనొప్పి, రుచి లేదా వాసన కోల్పోవడం లాంటి సమస్యలతో బాధ పడతారు. కరోనా వైరస్ కళ్లు లేత గులాబీ రంగులో కనిపించడానికి కారణమవుతుంది. కొన్ని రోజుల క్రితం అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ కళ్ల ద్వారా కరోనా బారిన పడే అవకాశాలు ఉన్నాయని చెప్పిన సంగతి తెలిసిందే. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో సామాజిక దూరం సాధ్యం కాని ప్రదేశాలలో కళ్లజోడు ఉపయోగించాలని వైద్యులు సూచిస్తున్నారు.
కండ్ల కలక సమస్య లేదా కళ్లు లేత గులాబీ రంగులోకి మారడం లాంటి లక్షణాలను గమనిస్తే కరోనా పరీక్షలు చేయించుకోవడం మంచిది. మరోవైపు దేశంలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 55,078 పాజిటివ్ కేసులు నమోదు కాగా 779 మంది మృతి చెందారు. వేల సంఖ్యలో కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న నమోదైన మరణాలతో కరోనా మరణాలు సంభవిస్తున్న దేశాల జాబితాలో భారత్ ఐదో స్థానంలో నిలిచింది.