అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్న ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్... కానీ....?

Reddy P Rajasekhar
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. రెండు నెలల క్రితం ఏపీలో 100కు అటూఇటుగా కేసులు నమోదు కాగా ప్రస్తుతం 10,000కు అటూఇటుగా కేసులు నమోదవుతున్నాయంటే వైరస్ ఏ స్థాయిలో వ్యాప్తి చెందుతుందో సులభంగానే అర్థమవుతుంది. వ్యాక్సిన్ కోసం జనాలు ఆశగా ఎదురుచూస్తున్నా మరికొన్ని నెలలు ఎదురు చూడాల్సిందేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
 
తొలి, రెండో దశల్లో పలు వ్యాక్సిన్లు మంచి ఫలితాలే సాధించినా తుది దశ ప్రయోగ ఫలితాలే కీలకం. అయితే తాజా అధ్యయనం ఒకటి తొలినాళ్ల నుంచి మంచి ఫలితాలు సాధిస్తున్న ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ గురించి అధ్యయనం చేసి కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చింది. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కోతుల్లో వైరల్ లోడ్ ను తగ్గించడంలో సక్సెస్ అయిందని... వ్యాక్సిన్ తీసుకున్న కోతుల్లో ఊపిరితిత్తులకు అపాయం కలగలేదని తేలింది.
 
అయితే ఈ అధ్యయనం ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా సోకకుండా పూర్తిగా నివారించడం సాధ్యం కాదని అభిప్రాయపడింది. కరోనా మానవ శరీరంలోని కణాల్లోకి వైరస్ లో ఉండే స్పైక్ ప్రోటీన్ సహాయంతో ప్రవేశిస్తుంది. శాస్త్రవేత్తలు ప్రధానంగా స్పైక్ ప్రోటీన్ ను నిలువరించేలా వ్యాక్సిన్లను తయారు చేయడంపై దృష్టి పెట్టారు. సాధారణ జలుబుకు కారణమైన అడినో వైరస్ లో కూడా స్పైక్ ప్రోటీన్ ఉంటుంది.
 
బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్ పరిశోధకులు సీహెచ్‌ఏడీవోఎక్స్‌1 ఎన్‌కొవ్‌-19 అనే పేరుతో అడినో వైరస్ ను బలహీనపరిచే వ్యాక్సిన్ ను తయారు చేశారు. ఆరు కోతులకు ఈ వ్యాక్సిన్ ను ఇచ్చి 28 రోజుల తర్వాత కోతులకు కరోనా సోకేలా చేశారు. కరోనా వ్యాక్సిన్ వైరస్ వల్ల తలెత్తే న్యూమోనియాను నిలువరించడంలో సక్సెస్ అయినట్లు తేలింది. వ్యాక్సిన్ రోగ నిరోధక వ్యవస్థను బలపరచడంలో కూడా సక్సెస్ అయినట్లు గుర్తించారు. మరోవైపు రష్యా ఆగష్టు 10వ తేదీలోపు వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొస్తానని ప్రకటన చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: