ఏపీ పదో తరగతి విద్యార్థులకు శుభవార్త... ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు మూడు ప్రతిపాదనలు...?
దేశంలో కరోనా వైరస్ విలయతాండవం కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతూ ప్రజల్లో భయాందోళనను పెంచుతున్నాయి. వైరస్ వ్యాప్తి వల్ల దేశంలో అనేక పరీక్షలు రద్దయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం మార్చి నెలలో జరిగే పదో తరగతి పరీక్షలు రద్దు కావడంతో పాటు తెలుగు రాష్ట్రాల సీఎంలు విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఏపీ ట్రిపుల్ ఐటీల్లో ప్రతి సంవత్సరం పదో తరగతి గ్రేడ్ పాయింట్ల ఆధారంగా అడ్మిషన్లు జరిగేవి. ట్రిపుల్ ఐటీలు ప్రారంభమైన 2008 సంవత్సరం నుంచి ఈ ప్రాతిపదికనే అడ్మిషన్లు జరుగుతున్నాయి. యూనివర్సిటీ నిబంధనల్లో సైతం మార్కులు, జీపీఏ ఆధారంగానే ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలు కల్పించాలని నిబంధనలు ఉన్నాయి. ఊహించని విధంగా పదో తరగతి పరీక్షలు రద్దు కావడంతో ఏ ప్రాతిపదికన ప్రవేశాలు కల్పిస్తారని గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది.
రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ (ఆర్‌జీయూకేటీ) ఆధ్వర్యంలో నడిచే ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం అధికారులు మూడు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. 2019 - 20 విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన ఇంటర్నల్ పరీక్షల మార్కులను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ఆప్షన్ కుదరని పక్షంలో విద్యార్థుల 9వ తరగతి ఫైనల్ పరీక్షల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని అనుకుంటున్నారు.
ఈ రెండు ఆప్షన్లు సాధ్యం కాని పక్షంలో ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పించాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. అయితే కరోనా ఉధృతి నేపథ్యంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పరీక్ష నిర్వహించడం సులువు కాదు. మూడు ఆప్షన్లను ప్రభుత్వం ముందు ఉంచి ప్రభుత్వ నిర్ణయం మేరకు ముందుకు వెళ్లాలని ఆర్జీయూకేటీ భావిస్తోంది