ధూమపానం అలవాటు ఉన్నవాళ్లకు కరోనా సోకే అవకాశాలు ఎక్కువ... ఆరోగ్య శాఖ హెచ్చరిక....?

Reddy P Rajasekhar

దేశంలో శరవేగంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో నమోదవుతున్న కేసులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. కరోనా వైరస్ కు సంబంధించి వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు ప్రజల్లో ఆందోళనను మరింత పెంచుతున్నాయి. తాజాగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ పొగ తాగే వారికి షాక్ ఇచ్చింది. ధూమపానం అలవాటు ఉన్నవారికి కరోనా హాని ఎక్కువని కీలక ప్రకటన చేసింది. 
 
సాధారణంగా పొగ తాగే సమయంలో చేతి వేళ్లు పెదాలను తాకుతాయనే సంగతి తెలిసిందే. అలా తాకిన సమయంలో చేతిపై కరోనా వైరస్ ఉంటే వైరస్ భారీన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చేతిపై ఉన్న కరోనా వైరస్ పెదవుల ద్వారా నోట్లోకి వెళ్లటం వల్ల కరోనా సోకే అవకాశాలు పెరుగుతాయి. అందువల్ల వైరస్ ఉధృతి తగ్గే వరకు ధూమపానానికి దూరంగా ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 
 
సాధారణంగా పొగ తాగే వాళ్లలో ఊపిరితిత్తులు కొంత మేర దెబ్బతిని ఉంటాయి. అలాంటి వాళ్లకు కరోనా సోకితే ప్రాణాంతకం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపే కరోనా వైరస్ పొగ తాగే వాళ్లలో మరింత ఎక్కువగా ప్రభావం చూపుతుంది. గతంలో చైనా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో పొగ తాగే వాళ్లకు కరోనా సోకే అవకాశాలు 14 రెట్లు ఎక్కువగా ఉంటాయని తేలింది. 
 
వేలాది మందిపై పరిశోధనలు చేసి చైనా శాస్త్రవేత్తలు ఈ విషయాలను ప్రకటించారు. కరోనా సోకిన వాళ్లలో ఛాతీ, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ వస్తుంది. వాళ్లలో శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడే వాళ్లు వైరస్ భారీన పడితే కోలుకునే అవకాశాలు తక్కువ. ధూమపానం అలవాటు ఉన్నవాళ్లలో రోగ నిరోధక శక్తి తగ్గుతుందని గతంలో శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో తేలింది. అందువల్ల ధూమపానం అలవాటు ఉన్నవాళ్లు ఆ అలవాటును మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: