కేసీఆర్ సర్కారుపై.. మరింత అనుమానం పెంచిన రేవంత్ రెడ్డి..?

Chakravarthi Kalyan

తెలంగాణ సచివాలయం కూల్చివేతపై కొన్నాళ్లుగా తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పోరాడుతున్న సంగతి తెలిసిందే. సచివాలయం జీ బ్లాక్ కింద ఉన్న నిధుల కోసమే కేసీఆర్ రహస్యంగా సచివాలయం  కూల్చివేత విషయంలో గోప్యత పాటిస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కోర్టుల్లో న్యాయపోరాటం కూడా సాగుతోంది.

 


కాంగ్రెస్ పోరాటానికి తోడు.. ఇటీవల ఓ పత్రిక కూల్చివేత కవరేజ్‌కు అనుమతించాలంటూ హైకోర్టుకు ఎక్కింది. చివరకు హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం కూల్చివేత కవరేజీకి మీడియా ప్రతినిధులను అనుమతించింది. అయితే కూల్చివేతల తీరు విషయంలో కేసీఆర్ సర్కారు వైఖరి మరోసారి బయటపడిందని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. 

 


ఆయన ఏమంటున్నారంటే..  మిగతా బ్లాకుల శిథిలాలను అలాగే వదిలేసి, జీ బ్లాక్‌ను మాత్రం పూర్తిగా కూల్చివేశారని అంటున్నారు. జీ బ్లాక్ దగ్గర శిథిలాలు తొలగించారని, చదును చేసి చిన్న ఆనవాళ్లు కూడా లేకుండా చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. జీ బ్లాక్‌ కింద సొరంగాలు, గుప్త నిధులు ఉన్నట్లు తాము చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలా సర్కారు వ్యవహారం ఉందని విమర్శించారు. 

 


హైకోర్టు ఒత్తిడితో సచివాలయం కూల్చివేత ప్రాంతానికి మీడియాను తీసుకెళ్లినా వంద మీటర్లకు మించి లోనికి వెళ్లనీయలేదంటున్నారు రేవంత్ రెడ్డి. 26 ఎకరాల స్థలంలో వంద మీటర్లకు మించి లోనికి వెళ్లనీయలేదంటే ప్రభుత్వ ఉద్దేశాలు అర్థమవుతున్నాయన్నారు. ముఖ్యంగా నల్ల పోచమ్మ దేవాలయం, మసీదులు కూలిన ప్రాంతానికి వెళ్లనీయలేదని, ఆలయంలో విగ్రహాలను భద్రపరిచారో లేదో కూడా తెలియదంటున్నారు రేవంత్ రెడ్డి. మొత్తం మీద కేసీఆర్ సర్కారుపై రేవంత్ రెడ్డి మరికొంత అనుమానం పెంచేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: