చైనా తలపొగరు దిగేలా భారత్ ప్రయత్నం.. !
సరిహద్దుల్లో హద్దులు మీరుతున్న డ్రాగన్‌కు భారత్ షాకుల మీద షాకులిస్తోంది. నిబంధనల్ని ఉల్లంఘిస్తున్న చైనా యాప్‌లపై భారత్ నిఘా పెట్టింది. ఇప్పటికే 59 చైనా యాప్‌లను నిషేధించిన భారత్...మరికొన్నింటిపై వేటు వేసేందుకు సన్నద్ధమవుతోంది. మొత్తం 275 చైనా మొబైల్ యాప్స్ డేటా తస్కరిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు.
పబ్‌జీ ప్లేయర్స్.. లూడో వాల్డ్ యాప్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్. చైనా తలపొగరు దించేందుకు...భారత ప్రభుత్వం మరికొన్ని యాప్స్ బ్యాన్ చేసే దిశగా ముందుకు వెళుతోంది. ఇటీవలే చైనాకు చెందిన 59 యాప్స్‌ని నిషేధించింది కేంద్రప్రభుత్వం.
ఇండియా, చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో భారత ప్రభుత్వం డ్రాగన్ యాప్స్‌ని బ్యాన్ చేసే దిశగా ఆలోచిస్తోంది. జాతీయ భద్రతకు, ప్రైవసీకి ముప్పుగా ఉన్న మరో 275 యాప్స్‌ని పరిశీలిస్తోంది. ఇప్పటికే ఇండియాలో బాగా పాపులర్ అయిన టిక్‌టాక్, హెలో లాంటి 59 యాప్స్‌ని భారత ప్రభుత్వం బ్యాన్ చేయడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ప్రస్తుతం భారత్ నిషేధం విధిస్తున్నట్టుగా భావిస్తున్న 47 యాప్స్‌లో పాపులర్ గేమింగ్ యాప్స్ అయిన పబ్‌జీ మొబైల్, లూడో వాల్డ్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అలీ ఎక్స్‌ప్రెస్ లాంటివి ఉన్నాయి. పబ్‌జీ చైనాకు చెందిన టెక్ దిగ్గజం టెన్సెంట్ కంపెనీది కాగా, అలీ ఎక్స్‌ప్రెస్ అలీబాబాది.
కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ చైనాలో సర్వర్లు ఉన్న యాప్‌లను గుర్తించే పనిలో పడింది. యాప్‌ల ద్వారా డేటా ఎలా మారుతుందో సమాచారం సేకరిస్తోంది. అవసరమైతే చైనాలో సర్వర్లు ఉన్న అన్ని యాప్‌లపై వేటు వేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, యాప్‌ల నిషేధంపై చైనా అసహనం వ్యక్తం చేస్తోంది. ఇక నిషేధానికి గురైన కొన్ని సంస్థలు తమ కార్యకలాపాల్ని చైనా వెలుపలకు తరలించేందకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు.
గాల్వన్ లోయల్ భారత్-చైనా మధ్య ఉద్రిక్తలు నెలకొన్నప్పటి నుంచి... భారత్ చైనాకు చెందిన యాప్‌లపై ప్రత్యేక దృష్టి సారించింది. చైనా యాప్ లు.....భారత వినియోగదారుల డేటా తస్కరిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కేంద్రం ముందుంచారు.
టిక్ టాక్ పై నిషేధం విధించిన తర్వాత చైనా కు చెందిన జిలి, స్నాక్ వీడియో అనే రెండు మొబైల్ ఆప్స్ ప్రత్యామ్నాయంగా నిలిచాయి. ఇదే మాదిరి మరికొన్ని యాప్స్ మారుపేర్లతో పుట్టుకొస్తున్నాయి. ఇదే అంశం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో చైనా యాప్స్‌కు చెక్ పెట్టేదిశగా భారత ప్రభుత్వం అడుగులు వేస్తోంది.