ఇండియా - పాక్ దేశాల మధ్య కార్గిల్ యుద్ధం ఎలా మొదలైందంటే....?
మన దేశం ప్రతి సంవత్సరం జూలై 26న విజయ్ దివస్ నిర్వహిస్తోంది. భారత్ ను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయవద్దని భారతీయులందరూ పాక్ దేశాన్ని హెచ్చరించి... పాక్ సైన్యంపై సాధించిన అసామాన్య విజయానికి ప్రతీక ఈరోజు. ఇరు దేశాల మధ్య జరిగిన ఈ యుద్ధం మొదలుకావడం వెనుక ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. హిమాలయ పర్వతాల్లోని ఘర్‌కోం అనే గ్రామంలో తషీ నామ్‌గ్యాల్ అనే గొర్రెల కాపరి తప్పిపోయిన తన గొర్రెలను వెతుక్కుంటూ పాక్ సరిహద్దు వరకు వెళ్లారు.
ఆ సమయంలో అక్కడ చాలామంది పాక్ సైనికులు భారత్ భూభాగంలోకి వచ్చి బంకర్లు తవ్వడాన్ని గొర్రెల కాపరి తషీ గమనించాడు. సైనికుల దుస్తులను బట్టి తషీ వాళ్లు పాక్ సైనికులేనని నిర్ధారించుకుని భారత సైనికులకు ఆ విషయాన్ని తెలియజేశాడు. కెప్టెన్ సౌరభ్ కాలియా తషీ చెప్పిన స్థలానికి మన దేశానికి చెందిన ఐదుగురు సైనికులతో వెళ్లాడు. పాక్ సైన్యం వాళ్లను బంధించి చిత్రహింసలకు గురిచేసి చంపేసింది.
కార్గిల్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో రెండు దేశాల మధ్య యుద్ధానికి అక్కడే తొలి అడుగు పడింది. అనంతరం దాయాది సైన్యం మన దేశంలోని భూభాగంలోకి 4 - 5 కిలోమీటర్లు చొచ్చుకుని వచ్చి 130 భారత శిబిరాలను ఆక్రమించింది. భారత సైనిక శిబిరాలు ఎన్ని హెచ్చరికలు చేసినా పాక్ సైన్యం పట్టించుకోలేదు. దీంతో ఆపరేషన్ విజయ్ పేరుతో భారత సైన్యం 1999, మే 3న రంగంలోకి దిగింది.
మే 26వ తేదీన చొరబాటుదారులపై భారత వాయుసేన దాడులు చేసింది. జూన్ 5వ తేదీన ముగ్గురు పాకిస్తాన్ సైనికుల నుండి స్వాధీనం చేసుకున్న పత్రాలని భారత సైన్యం బయటపెట్టి పాకిస్తాన్ జోక్యాన్ని ప్రపంచానికి తెలియజేసింది. జూన్ 13న ద్రాస్ సెక్టారులోని తోలోలింగ్‌ను భారత సైన్యం స్వాధీనపరచుకుంది. జులై 5న భారత సైన్యం ద్రాస్‌పై నియంత్రణ సాధించింది. క్లింటన్‌తో సమావేశం తరువాత, పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ కార్గిల్ నుండి వెనక్కి వెళ్తున్నట్లు ప్రకటించాడు. జులై 14న ఆపరేషన్ విజయ్ విజయవంతమైందని భారత ప్రధాని వాజ్ పేయ్ ప్రకటించారు. జూలై 26న కార్గిల్ యుద్ధం అధికారికంగా ముగిసింది.