అన్ లాక్ 2.0 : జ్వరం వస్తే కరోనానా...? కాదా...? ఎలా గుర్తించాలంటే....?
భారత్ లో కరోనా వైరస్ చాప కింద నీరులా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో 50,000కు అటూఇటుగా కేసులు నమోదవుతున్నాయి. మన దేశంలో చాలావరకు జ్వరాన్ని ప్రామాణికంగా తీసుకుని కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ ఇలా ప్రతి చోట థర్మో మీటర్ల ద్వారా కరోనా పరీక్షల నిర్వహణ జరుగుతోంది. జ్వరంతో శరీరం వేడెక్కితే కరోనా అని అధికారులు భావిస్తున్నారు.
అనుమానం ఉన్నవాళ్లను క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. దీనిపై ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పరిశోధనలు చేసింది. ఈ పరిశోధనల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. జ్వరాన్ని ప్రామాణికంగా తీసుకుని కరోనా పరీక్షలు నిర్వహించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని వైద్యులు తేల్చారు. జ్వరం వస్తే కరోనా కాదని పొడి దగ్గు, అలసట, గొంతు నొప్పి లాంటి లక్షణాలు కూడా కనిపిస్తే కరోనాగా భావించాలని చెబుతున్నారు.
అయితే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లలో కరోనా సోకినా ఎటువంటి లక్షణాలు కనిపించడం లేదని... ఫలితంగా వైరస్ చాప కింద నీరులా శరవేగంగా వ్యాప్తి చెందుతోందని చెబుతున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల బృందం మార్చి 23 నుంచి ఏప్రిల్ 15 వరకు కరోనా వైరస్ లక్షణాల గురించి అనేక పరిశోధనలు చేసింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌కు చెందిన ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లో దీనికి సంబంధించిన వివరాలను ప్రకటించింది.
ఎయిమ్స్‌లో చేరిన 144 మంది బాధితుల్లో లక్షణాలను పరిశీలిస్తే కేవలం 17 శాతం మందికి మాత్రమే జ్వరం వచ్చిందని... జ్వరంతో పాటు ఇతర లక్షణాలు కనిపించాయని... మిగిలిన వాళ్లలో చాలామందికి శ్వాస సంబంధ సమస్యలు, గొంత నొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపించాయని వైద్యులు తెలిపారు. థర్మో టెస్టుల ద్వారా పరీక్షలు నిర్వహించినా పెద్దగా ఫలితం ఉండదని... ప్రజలు వీలైనంత వరకు బయటకు వెళ్లకపోవడమే ఉత్తమమని సూచిస్తున్నారు.