రైతులకు జగన్ సర్కార్ శుభవార్త.... అధికారులకు సీఎం కీలక ఆదేశాలు...?
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంటల విషయంలో ఫుడ్ ప్రాసెసింగ్‌ను ప్రోత్సహించాలని రైతులను ఆదేశించారు. పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు కష్టపడకూడదని చెప్పారు. అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి వచ్చే సీజన్ లోపు ఫుడ్ ప్రాసెసింగ్‌కు ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈరోజు సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ సమీక్షలో జగన్ అరటి, చీనీ, టమోటా రైతులు ప్రతి సంవత్సరం కనీస గిట్టుబాటు ధర రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను కాపాడాలంటే వాళ్ల నుంచి ఎంత మొత్తం కొనుగోలు చేయాలో.. ఎంత మొత్తం ఫుడ్‌ప్రాసెసింగ్ కు తరలించాలనే విషయాలపై అధికారులు దృష్టిపెట్టాలని అన్నారు. ఇందుకోసం ఎంత ఖర్చైనా పరవాలేదని... సమస్యకు పరిష్కారం ఉండాలని జగన్ అధికారులకు సూచించారు.
ప్రతి సంవత్సరం అరటి, చీనీ, టమోటా, ఉల్లి, నిమ్మ రైతులు కష్టాలు పడుతున్నారంటూ కథనాలు వస్తున్నాయని.... ఇకపై అలాంటి కథనాలు తనకు కనిపించకూడదని సీఎం అన్నారు. ప్రతి ఏటా ఇలాంటివి పునరావృతం కాకూడదని... మిల్లెట్స్ ప్రాససింగ్‌పై కూడా దృష్టి పెట్టాలని చెప్పారు. ప్రఖ్యాత కంపెనీలతో ఫుడ్ ప్రాసెసింగ్ గురించి టై అప్ చేసుకోవాలని.... ఇబ్బందులు వస్తున్న 7 లేదా 8 పంటలను గుర్తించాలని చెప్పారు.
పంటల ప్రాసెసింగ్ చేయడానికి సంబంధించి ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారో తనకు నివేదించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. నెలరోజుల్లోగా ఫుడ్ ప్రాసెసింగ్ కు సంబంధించిన కార్యాచరణ పూర్తి కావాలని చెప్పారు. అవసరమైన చోట్ల రైతుభరోసా కేంద్రాల సహాయంతో ప్రాథమిక స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ చేయాలని చెప్పారు. మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో అంచనాలు తయారు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల రైతులు వేసిన పంటలకు గిట్టుబాటు ధర లభించనుండటంతో పాటు ప్రభుత్వమే పంటను కొనుగోలు చేయడంతో వాళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.