అన్ లాక్ 2.0 : కరోనా గురించి మరో షాకింగ్ న్యూస్... తల నుంచి కాలివేళ్ల వరకు వైరస్ ప్రభావం...?
భారత్ లో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. సాధారణంగా ఈ వైరస్ గొంతును, ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. మరికొందరిలో గుండెపై ప్రభావం చూపుతుంది. అయితే తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో కీలక విషయాలు బయటపడ్డాయి. అన్ లాక్ 2.0 సడలింపుల తర్వాత దేశంలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి తలభాగం మొదలుకొని కాలివేళ్ల వరకు శరీరంలోని అన్ని అవయవాలపై ప్రభావం చూపుతోంది.
కరోనా సోకిన వాళ్లలో వైద్యనిపుణులు పక్షవాతం రావడాన్ని గుర్తించారు. అయితే చాలా అరుదుగా మాత్రమే ఈ లక్షణం తమకు కనిపించిందని వాళ్లు చెబుతున్నారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్లలో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల క్లాట్స్ ఏర్పడి పక్షవాతం వస్తున్నట్టు తాము గుర్తించామని అన్నారు. రక్తంలో ఆక్సిజన్ తగ్గడం వల్ల మెదడుకు సరైన మోతాదులో ఆక్సిజన్ అందక కొందరిలో మెదడు గాయపడినట్లు చెబుతున్నారు.
కరోనా సోకిన రోగుల్లో వాసనలు, రుచి తెలియకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే చికిత్స తరువాత వాసన, రుచి గుర్తిస్తున్నామంటే వ్యాధి నుంచి క్రమంగా బయటపడుతున్నామని గ్రహించాలి. కరోనా రోగుల్లో ఎక్కువమందిలో ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం పడుతోంది. వైరస్ ప్రభావంతో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి క్లాట్స్ ఏర్పడి... రక్తప్రవాహంతోపాటు అవి ఊపిరితిత్తుల్లోకి కొట్టుకురావడం వల్ల గాలిమార్పిడి ప్రక్రియకు అవరోధం కలుగుతోంది.
కరోనా వల్ల కొందరిలో కిడ్నీలు దెబ్బ తిని అక్యూట్ కిడ్నీ డిసీజ్‌కు దారి తీస్తున్నట్టు వైద్యులు గుర్తించారు. బ్లడ్‌ప్రెజర్ పడిపోవడం, ఆక్సిజన్ సరఫరా తగ్గిపోవడం వల్ల కిడ్నీలు దెబ్బ తినే అవకాశం ఉంది. రోగులకు వాడే రకరకాల మందులు సైతం కిడ్నీలపై దుష్ప్రభావం చూపుతున్నాయి. కొందరు రోగుల్లో మూత్రం ద్వారా ప్రోటీన్లు పోతున్నాయని వైద్యులు గుర్తించారు. రక్తనాళాలు, క్లోమ గ్రంథి, ఎండోక్రైన్ సిస్టమ్, కాలివేళ్ల చివరలు(కోవిడ్ టోస్), జుట్టు, చర్మం, గుండె, జీర్ణవ్యవస్థ, కాలేయం, ప్రత్యుత్పత్తి అవయవాలపై వైరస్ ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.