భారీ నష్టాల్లో తెలంగాణ ఆర్టీసీ.... ఆదాయం కోసం ఏం చేస్తోందంటే....?

Reddy P Rajasekhar

దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. తెలంగాణలో ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ విజృంభణ ప్రభావం ఆర్టీసీపై కూడా పడింది. గతంతో పోలిస్తే బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గింది. దీంతో తెలంగాణ ఆర్టీసీకి నష్టాలు పెరిగాయి. రోజురోజుకు నష్టాలు పెరుగుతుండటంతో టికెట్టేతర ఆదాయంపై ఆర్టీసీ దృష్టి పెట్టింది. పార్శిల్, కార్గో సేవలు ఆర్టీసీకి నష్టాన్ని తగ్గిస్తున్నాయి. 
 
ప్రతిరోజూ పార్శిల్, కార్గో సేవల ద్వారా ఆర్టీసీకి 5 లక్షల రూపాయల ఆదాయం వస్తోంది. నెలకు వెయ్యి టన్నుల వరకు సరుకు కార్గో ద్వారా రవాణా అవుతున్నట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఆర్టీసీకి ప్రజారవాణా ద్వారా పెద్దగా ఆదాయం చేకూరటం లేదు. సాధారణ పరిస్థితులు నెలకొనటానికి ఇంకా ఎన్నిరోజులు పడుతుందో తెలీదు. దీంతో టికెట్టేతర ఆదాయం పెంచుకునే ఉద్దేశంలో భాగంగా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తో ఒప్పందం చేసుకోవడానికి సిద్ధమవుతోంది.      
 
అమెజాన్ కు కార్గో సేవలు అందించడానికి ఆర్టీసీ సిద్ధమవుతోంది. కార్గో సేవల ద్వారా హైదరాబాద్ నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు, ఏపీలోని పలు జిల్లాలకు సరుకు రవాణా చేస్తామని కోరింది. ఆర్టీసీ వర్గాలు అమెజాన్ తో త్వరలో చర్చలు జరపనున్నాయి. తెలంగాణ ఆర్టీసీ మూడు నెలల క్రితం కార్గో సేవలను 20 రోజుల క్రితం పార్శిల్ సేవలను ప్రారంభించింది. బస్సుల ద్వారా హైదరాబాద్ నుంచి తెలంగాణలోని పలు నగరాలకు ఔషధాలను సరఫరా చేస్తోంది. 
 
విద్యాశాఖకు చెందిన పాఠ్యపుస్తకాల రవాణాను ఆర్టీసీ కార్గో దక్కించుకుంది. ఇప్పటికే 350 టన్నుల పుస్తకాలను రవాణా చేయగా మరో 600 టన్నుల పుస్తకాలను రవాణా చేయడానికి సిద్ధమైంది. ఆర్టీసీ, కార్గో వ్యవహారాల శాఖ అధికారి కృష్ణకాంత్ ఇతర రాష్ట్రాలకు కూడా సేవలు అందించి ఆదాయం పెంచుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: